
సుమారు 15 ఏళ్ల క్రితం అంతా యువకులతో కూడిన భారత జట్టు ప్రపంచ క్రికెట్‌పై చెరగని ముద్ర వేసింది. మొట్టమొదటి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. అంతకుముందు వన్డే వరల్డ్ కప్‌లో అత్యంత అవమానకర రీతిలో ఇంటిదారి పట్టిన టీమిండియా.. ఎలాంటి అంచనాలు లేకుండా సౌతాఫ్రికాలో అడుగు పెట్టింది. తొలిసారి మహేంద్ర సింగ్ ధోనీ సారధ్యంలో బరిలో దిగిన భారత జట్టు ఎవరూ ఊహించని విధంగా ఫైనల్ చేరింది. ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి తొలి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని అందుకుంది.
ఈ విజయం క్రీడాభిమానులు మనసులపై చెరగని ముద్ర వేసింది. ఆ తర్వాత ఎన్నోసార్లు ఫేవరెట్‌గా బరిలో దిగినా కూడా ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయడంలో భారత జట్టు విఫలమైంది. తాజాగా ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టోర్నీలో కూడా సెమీఫైనల్‌లో చిత్తుగా ఓడి ఇంటికి వచ్చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్‌తో తలపడిన ఇంగ్లండ్ జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో టీమిండియాకు మరోసారి నిరాశే మిగిలింది. మరో రెండేళ్ల వరకూ పొట్టి ప్రపంచకప్ లేదు. అయితే ఇప్పటి నుంచే ఆ టోర్నీ కోసం మరోసారి యువకులతో కూడిన జట్టును సిద్ధం చేసేందుక బీసీసీఐ ప్రయత్నిస్తోంది.
ఇలాంటి సమయంలో భారత జట్టు తొలి టీ20 వరల్డ్ కప్ గెలిచిన విజయాన్ని డాక్యుమెంటరీ చేయాలని ఇంగ్లండ్‌కు చెందిన 'వన్ వన్ సిక్స్ నెట్‌వర్క్' అనే ప్రొడక్షన్ బృందం అనుకుందట. ఈ చిత్రంలో 15 మంది భారత ఆటగాళ్లు కూడా పాల్గొంటున్నారట. ఇప్పటికే మూడొంతుల షూటింగ్ కూడా పూర్తయినట్లు ప్రముఖ ఫిలిం క్రిటిక్ తరణ్ ఆదర్శ్ వెల్లడించాడు. ఈ సినిమా వచ్చే ఏడాది అంటే 2023లో విడుదల అవుతుందట. ఇప్పటికైతే సినిమాకు ఇంకా పేరు ఏం పెట్టలేదని, త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారని తరణ్ ఆదర్శ్ వెల్లడించాడు. ఈ వార్త విన్న క్రికెట్ ఫ్యాన్స్ చాలా సంతోషిస్తున్నారు.