
హైదరాబాద్: కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. శనివారం టీమిండియా నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొంది. ఈ నెట్ ప్రాక్టీస్ అనంతరం రవిశాస్త్రి మీడియాతో మాట్లాడుతూ దక్షిణాఫ్రికా సవాల్‌కు భారత జట్టు సిద్ధంగా ఉందని తెలిపాడు.
గతంతో పోలిస్తే ఇప్పటి జట్టు మరింత బలంగా ఉందని రవిశాస్త్రి ధీమా వ్యక్తం చేశారు. 'దక్షిణాఫ్రికా సవాల్‌కు సిద్ధంగా ఉంది. నాలుగేళ్ల క్రితం ఈ ప్రశ్న మీరు అడిగితే నేను కాదు అని చెప్పేవాడిని. కానీ, ఇప్పటి జట్టు ఎంతో అనుభవం సంపాదించింది. ప్రత్యర్థి ఎవరైనా సరే గెలుపే ముందుకు సాగుదాం. మేం అవతలి వారిని గౌరవిస్తాం' అని రవిశాస్త్రి అన్నాడు.
'పిచ్‌ను చూసి పరిస్థితులను అంచనా వేస్తాం. గతంతో పోలిస్తే భారత రిజర్వ్ బెంచ్ ఫాస్ట్ బౌలింగ్ బలం పెరిగింది. ఇరవై వికెట్లు తీయడంలో ఇదెంతో కీలకం' అని రవిశాస్త్రి అన్నారు. ఇక, పేస్ విభాగం బలం పెరగడంతో క్యురేటర్లు ఊరించే పిచ్‌ను తయారు చేస్తారా? అన్న ప్రశ్నకు రవిశాస్త్రి తనదైన శైలిలో స్పందించాడు.
'ప్రతి మ్యాచ్‌ను మేం స్వదేశంలో ఆడినట్టే ఆడతాం. తొలి టెస్టు మ్యాచ్ జరిగే కేప్‌టౌన్‌నూ అలాగే భావిస్తున్నాం. ముందు పిచ్‌ను పరిశీలిస్తాం. పరిస్థితులను అర్ధం చేసుకుని ఆడతాం. పిచ్‌పై మాకెలాంటి ఫిర్యాదులు ఉండవు. రెండు జట్లూ అదే వికెట్‌పై ఆడతాయి కదా. ఇంగ్లాండ్‌లోనూ పేస్ పిచ్‌లే ఉంటాయి. భారత్‌లో టర్న్ అవ్వొచ్చు' అని అన్నాడు.
'ఎక్కడికెళ్లినా పరిస్థితులకు తగ్గట్టు ఆడాల్సి ఉంటుంది. భారత జట్టులోని యువ కుర్రాళ్లు క్రికెట్‌లో సంతృప్తిని కోరుకుంటున్నారు. పరుగులు చేసి వికెట్లు తీసినప్పుడు మాత్రమే అది కలుగుతుంది. అందుకే బాగా కష్టపడుతున్నారు. దక్షిణాఫ్రికా అద్భుతమైన జట్టు. కోహ్లీసేనకు ఇదొక గొప్ప అవకాశం' అని రవిశాస్త్రి తెలిపాడు.
దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా కోహ్లీసేన మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా జనవరి 5న కేప్‌టౌన్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.