అడిలైడ్: భారత క్రికెట్ జట్టు నెట్ ప్రాక్టీస్‌కు రావడం ఎప్పుడూ ఒక సంబరంగా ఉంటుంది. మీడియా, కొద్ది మంది అభిమానులు మైదానం వద్ద గుమిగూడి చూస్తుండగా టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌ను కొనసాగిస్తుంది. మీడియా ప్రతినిధులు విరామం లేకుండా కెమెరాలకు పని చెప్తారు. కానీ, శుక్రవారం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపించింది.
ఎలాంటి ఆర్భాటాలు లేకుండా టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్ కొనసాగించారు. వాస్తవానికి రెండు రోజుల రెండో వామప్ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా, ఫిలిప్ హ్యూస్ మృతి కారణంగా దానిని రద్దు చేశారు. దీంతో భారత ఆటగాళ్లు కొద్దిసేపు నెట్స్‌కు హాజరయ్యారు. హ్యూస్ మృతికి సంతాప సూచకంగా నల్ల బ్యాండ్లు ధరించారు.
అడిలైడ్ ఓవల్‌లోని ప్రధాన మైదానంలోగాక ఒక పక్కగా ఉన్న నెట్స్‌కే పరిమితమయ్యారు.
సౌత్ ఆస్ట్రేలియా క్రికెట్ సంఘం మెయిన్ పిచ్‌పై టోపీ, జెర్సీ, బ్యాట్‌ను ఉంచి హ్యూస్‌కు నివాళులర్పించింది. హ్యూస్ మృతి తమ జట్టుకు తీరని లోటని క్లబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కీత్ బ్రాడ్‌షా మీడియాతో అన్నారు. అతని కుటుంబానికి క్లబ్ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నామని తెలిపారు.

మొదటి టెస్టు రద్దు ఆలోచన వద్దు
సిడ్నీ: భారత్‌తో డిసెంబర్ నాలుగు నుంచి బ్రిస్బేన్‌లో ప్రారంభం కావాల్సిన మొదటి టెస్టును రద్దు చేయాలన్న ఆలోచనే వద్దని, దానిని షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) అధికారులకు మాజీ కెప్టెన్లు సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మ్యాచ్‌ని రద్దు చేయడం వల్ల నష్టమేగానీ లాభమేమీ ఉండదని స్పష్టం చేశారు. హ్యూస్ అకాల మరణంతో ఆసీస్ ఆటగాళ్లు దిగ్భ్రాంతికి గురయ్యారని, బాధను దిగమింగుకోవడం వారికి సులభం కాదని మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ అన్నాడు.
అయితే, బాధ నుంచి బయటపడేందుకు మ్యాచ్ ఆడటం ఒక్కటే సరైన మార్గమని ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. మొదటి టెస్టు జరిగితేనే ఇరు జట్ల ఆటగాళ్లతోపాటు ప్రజలు కూడా స్టేడియానికి వచ్చి, అకాల మరణంతో అందరినీ శోక సంద్రంలో ముంచిన హ్యూస్‌కు నివాళులర్పించే వీలుంటుందని తెలిపాడు. మరో మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశాడు.
మొదటి టెస్టు ఆడితేనే ఆసీస్ క్రికెటర్లకు లాభమని అన్నాడు. మ్యాచ్ ఉంటే, తప్పనిసరిగా వారంతా నెట్స్‌కు హాజరుకావాల్సి ఉంటుందని తెలిపాడు. ప్రాక్టీస్ సమయంలో, ఆ తర్వాత మ్యాచ్ జరుగుతున్నప్పుడు వారి దృష్టి మొత్తం ఆటపైనే కేంద్రీకృతమవుతుందని ఇయాన్ చాపెల్ అన్నాడు. మనసును కలచివేసే బాధ నుంచి ఉపశమనం పొందడానికి, మళ్లీ క్రికెట్‌ను కొనసాగించడానికి ఇదొక్కటే మార్గమని అన్నాడు.
ఇరు జట్ల ఆటగాళ్లు దిగ్భ్రాంతికి గురయ్యారని, వారు కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి మొదటి టెస్టును రద్దు చేయాలని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సూచించిన విషయం తెలిసిందే. అయితే, ఆసీస్ మాజీ కెప్టెన్లు మాత్రం టెస్టు కొనసాగితేనే మంచిదని అభిప్రాయపడ్డారు.