ఐపీఎల్ పండుగ ముగిసిన వెంటనే భారత జట్టు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఆడేందుకు ఇంగ్లండ్ వెళ్తుంది. ఈ క్రమంలోనే భారత జట్టును మూడు దశల్లో ఇంగ్లండ్ పంపాలని బీసీసీఐ అనుకుంటోందని తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఐపీఎల్ లీగ్ దశ ముగిసిన వెంటనే ఒక బ్యాచ్ జట్టు ఇంగ్లండ్ వెళ్తుందట. అంటే లీగ్ దశతో ఐపీఎల్ పోరాటం ముగించిన జట్లలో ఉన్న టీమిండియా ప్లేయర్లు అందరూ.. మే 23న ఇంగ్లండ్ వెళ్తారన్నమాట. ఇక ప్లేఆఫ్స్ చేరిన జట్లలోని ఆటగాళ్లు వాటి కోసం ఇక్కడే ఆగిపోతారు. ప్లేఆఫ్స్ ముగిసిన వెంటనే ఫైనల్ చేరిన జట్లలోని ఆటగాళ్లు మినహా మిగతా జట్లలోని భారత ఆటగాళ్లు ఇంగ్లండ్ బయలుదేరతారట.

అంటే వీళ్లు మే 24న ఇంగ్లండ్ వెళ్లే బ్యాచ్‌లో ఉంటారన్నమాట. ఈ రెండో బ్యాచ్ ఇంగ్లండ్ చేరుకొని అక్కడ ప్రాక్టీస్ మొదలు పెడుతుంది. ఆ తర్వాత ఐపీఎల్ ఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఫైనల్ చేరిన జట్లలోని ప్లేయర్లు మూడో బ్యాచ్‌గా ఇంగ్లండ్ చేరుకుంటారు. ఇలా మూడు బ్యాచుల్లో ఇంగ్లండ్ చేరుకున్న ప్లేయర్లు అక్కడ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు కఠోర సాధన చేస్తారు.
గత డబ్ల్యూటీసీ సైకిల్‌లో కూడా టీమిండియా ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. కోహ్లీ సారధ్యంలో అద్భుతమైన విజయాలతో డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకుంది. కానీ ఫైనల్‌లో న్యూజిల్యాండ్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా మిగిలింది. ఈ క్రమంలో ఈసారి ఎలాగైనా ట్రోఫీ నెగ్గాలని భారత్ పట్టుదలగా ఉంది.
కాగా, టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఐపీఎల్‌లో ఆర్సీబీతో మ్యాచ్ సమయంలో రాహుల్‌కు గాయమైంది. దీంతో అతను ఈ మ్యాచ్‌కు దూరం అవుతున్నట్లు స్వయంగా ప్రకటించాడు. ఇక మిడిలార్డర్‌లో కీలకమైన శ్రేయాస్ అయ్యర్ కూడా శస్త్రచికిత్స కారణంగా ఈ మ్యాచ్ ఆడటం లేదన్న సంగతి తెలిసిందే.