కొన్ని సార్లు చరిత్రను తిరగరాసే వ్యక్తులు పుడతారు. పుట్టినప్పుడు వాళ్ల గురించి ఎవరికీ తెలీదు. కనీసం చరిత్ర సృష్టించే క్రమంలో వేసిన తొలి అడుగులు కూడా ఎవరూ గుర్తించరు. కానీ ఆ తర్వాత వాళ్లను మర్చిపోవడం కుదరదు. అలాంటి వాళ్లలో ఒకడు టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ. 2008 అండర్-19 వరల్డ్ కప్ నెగ్గిన కోహ్లీ.. ఆ తర్వాత భారత జట్టులో అరంగేట్రం చేశాడు.
అయితే సరిగ్గా ఇదే రోజు 2011లో తన తొలి టెస్టు మ్యాచ్ ఆడాడీ విశ్వవిజేత. ఆ తర్వాత టెస్టుల్లో అతను ఎన్ని రికార్డులు బద్దలు కొట్టాడో అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు 109 టెస్టులు ఆడిన అతను 8479 పరుగులు చేశాడు. వీటిలో 28 సెంచరీలు ఉండగా.. 11 శతకాలు సేనా (సౌత్ ఆఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో చేసినవే కావడం గమనార్హం.

ఇక వన్డేల్లో అయితే కోహ్లీ లెగసీ ఎంత చెప్పుకున్నా తక్కువే. ఓవరాల్‌గా చూసుకున్నా కూడా సచిన్ తర్వాత భారత్ తరఫున అత్యధిక శతకాలు చేసిన బ్యాటర్ కోహ్లీనే. అలాగే టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన ప్లేయర్ అతనే. కెప్టెన్‌గా అత్యథిక సెంచరీలు బాదింది కోహ్లీనే. కెప్టెన్‌గా భారత్ తరఫున అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్ కూడా కోహ్లీదే టాప్ ప్లేస్. కెప్టెన్‌గా విదేశాల్లో అత్యధిక విజయాలు నమోదు చేసింది కూడా అతనే.
వీటన్నింటితోపాటు టెస్టుల్లో అత్యుత్తమ టీంకు ఇచ్చే గదను ఐదుసార్లు అందుకున్న కెప్టెన్ కోహ్లీనే. గత రెండేళ్లలో డబ్ల్యూటీసీ వచ్చింది కానీ.. అంతకుముందు టెస్టుల్లో నెంబర్ వన్‌గా ఉన్న జట్టుకు ఈ గదను అందించే వారు. ఈ సమయంలో కోహ్లీ ఐదు సార్లు ఈ గద అందుకున్నాడు. ఇలా కేవలం కోహ్లీనే కాదు. టీమిండియా దిగ్గజాలు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ కూడా 1996లో ఇదే రోజున టెస్టు అరంగేట్రం చేయడం గమనార్హం.
ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. 'ఈ రోజు డేట్ గుర్తుంచుకో.. టెస్టుల్లో టీమిండియా చరిత్ర మారిన రోజు ఇదే' అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ద్రావిడ్.. దాదా.. ఆ తర్వాత కోహ్లీ టీమిండియా టెస్టు క్రికెట్‌ను మార్చేశారని చెప్పుకుంటున్నారు. అలాగే కోహ్లీని ఆ వయసులో చూసినప్పుడు ఎవరైనా ఊహించారా?.. ఈ కుర్రాడు ప్రపంచాన్ని ఏలతాడని? అని అడుగుతున్నారు.