
ఆస్ట్రేలియా సిరీస్‌లో అదిరే ఆరంభం పొందిన టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. వెన్నునొప్పి నుంచి కోలుకుంటూ టీమిండియాకు చాలా కాలంగా దూరంగా ఉంటున్న జస్‌ప్రీత్ బుమ్రా మరికొంత కాలం పాటు జట్టులో చేరడం అసాధ్యమని తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతను చాలా కీలకం అవుతాడని అంతకుముందు నిపుణులు భావించారు. కానీ గాయం నుంచి అతను పూర్తిగా కోలుకోలేదు. దీంతో తొలి రెండు టెస్టులకు ప్రకటించిన జట్టులో అతనికి చోటు దక్కలేదు.
అయితే చివరి రెండు టెస్టులకు అతను అందుబాటులో ఉంటాడని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత జరిగే వన్డే సిరీస్‌లో కూడా బుమ్రా ఆడతాడని కొందరు చెప్పారు. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, బుమ్రా పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి మరికొంత సమయం పడుతుందట. దీంతో ఆసీస్‌తో జరిగే చివరి రెండు టెస్టులకు కూడా అతను దూరం అవుతున్నట్లు బీసీసీఐ వర్గాలు చెప్తున్నాయి. దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటనా రాకపోవడం గమనార్హం.
కొన్నిరోజులుగా నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీయే)లో ఫుల్ టిల్ట్ బౌలింగ్ సెషన్స్‌లో బుమ్రా పాల్గొంటున్నాడని సమాచారం. ఈ క్రమంలో అతనికి వెన్నులో ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదని, అదే ప్రస్తుతానికి శుభవార్త అని ఎన్సీయే వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో ఆసీస్‌తో వచ్చే నెలలో జరిగే వన్డే సిరీస్‌లో అయినా అతను ఆడతాడా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయంలో అప్పుడే నిర్ణయం తీసుకోకూడదని బీసీసీఐ భావిస్తోందట.
ఈ ఏడాది చివర్లో వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో టీమిండియాకు బుమ్రా చాలా కీలకం కానున్నాడు. కాబట్టి అతని విషయంలో రిస్క్ తీసుకోకూడదని బీసీసీఐ అనుకుంటోంది. కానీ వన్డేలకు బుమ్రా మళ్లీ అలవాటు పడటం, ఫామ్ అందుకోవడం చాలా ముఖ్యం. అందుకని ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో అతన్ని ఆడించే అవకాశం ఉంది. ఈ విషయంపై వచ్చే వారంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని సమాచారం.