BCCI: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI), టీమిండియా ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న డ్రీమ్ 11 ఒప్పందం ముగిసిన తర్వాత కొత్త స్పాన్సర్ కోసం అన్వేషణ ప్రారంభించింది. పార్లమెంట్‌లో ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం పొందిన తర్వాత డ్రీమ్ 11 తమ ఒప్పందాన్ని గడువుకు ముందే రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితి బీసీసీఐకి ఒక సవాలుగా మారింది. ఎందుకంటే ఆసియా కప్ 2025 ప్రారంభానికి ముందే కొత్త స్పాన్సర్‌ను కనుగొనడం, ఆ తర్వాత జెర్సీలను ముద్రించడం వంటి సవాళ్లను బీసీసీఐ ఎదుర్కొంటోంది.
అయితే సమాచారం ప్రకారం.. బీసీసీఐ ఈ సవాల్‌ను ఒక అవకాశం మలచుకోవాలని చూస్తోంది. రాబోయే 2025-28 కాలానికి.. సుమారు 140 మ్యాచ్‌ల కోసం ఓ కొత్త స్పాన్సర్‌ను తీసుకురావాలని ప్రణాళికలు వేసింది. ఈ కొత్త ఒప్పందం ద్వారా 450 కోట్ల రూపాయల భారీ ఆదాయాన్ని అంచనా వేస్తోంది. ఇది గతంలో డ్రీమ్11 ఇచ్చిన 358 కోట్ల రూపాయల ఒప్పందం కంటే చాలా ఎక్కువ.

స్పాన్సర్‌షిప్ కోసం బీసీసీఐ కొత్త మార్గదర్శకాలు
కొత్త స్పాన్సర్‌షిప్ డీల్‌ను మరింత లాభదాయకంగా మార్చడానికి బీసీసీఐ కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. ప్రతి ద్వైపాక్షిక మ్యాచ్‌కు 3.5 కోట్ల రూపాయలు, ఐసీసీ(ICC), ఏసీసీ(ACC) వంటి పెద్ద టోర్నమెంట్లలో జరిగే మ్యాచ్‌లకు 1.5 కోట్ల రూపాయలు చొప్పున స్పాన్సర్‌షిప్ ఫీజును నిర్ణయించింది. ఈ రేట్లు డ్రీమ్11 చెల్లించిన దాని కంటే ఎక్కువ అయినప్పటికీ.. గతంలో బైజూస్ చెల్లించిన మొత్తాల కంటే మాత్రం తక్కువే.
ఈ స్పాన్సర్‌షిప్ కేవలం దేశీయ, విదేశీ మ్యాచ్‌లకు మాత్రమే కాకుండా.. ఏసీసీ, ఐసీసీ నిర్వహించే అన్ని అంతర్జాతీయ టోర్నమెంట్‌లకు కూడా వర్తిస్తుంది. ఇది స్పాన్సర్ సంస్థకు ఒక పెద్ద వేదికను అందిస్తుంది, ఎందుకంటే భారత జట్టు ప్రపంచవ్యాప్తంగా అపారమైన అభిమానులను కలిగి ఉంది.
సమయం తక్కువగా ఉన్నా ఆశాజనకంగా..
ఆసియా కప్ సమీపిస్తున్న తరుణంలో కొత్త స్పాన్సర్‌ను వెంటనే ఖరారు చేయడం బీసీసీఐకి అత్యవసరం. సమయం తక్కువగా ఉన్నప్పటికీ, బోర్డు మాత్రం ఆశాజనకంగా ఉంది. సెప్టెంబర్ 30న ప్రారంభం కానున్న మహిళల ప్రపంచ కప్‌కు ముందు కచ్చితంగా కొత్త డీల్‌ను ఖరారు చేస్తామని బీసీసీఐ వర్గాలు నమ్మకంగా ఉన్నాయి. ఇది కేవలం స్పాన్సర్‌షిప్ డీల్ మాత్రమే కాకుండా, భారత క్రికెట్ ఆర్థిక బలం, బ్రాండ్ విలువకు కూడా ఒక పరీక్షగా నిలవనుంది.