మరో నెలన్నర రోజుల్లో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ మెగాటోర్నీకి అమెరికా-వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. వన్డే వరల్డ్ కప్‌ను తృటిలో చేజార్చుకున్న భారత్ ఈ సారి పొట్టి ప్రపంచకప్‌ను తప్పక సాధించాలనే కసితో ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా సెలక్టర్లు జట్టు కూర్పుపై సంచలన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లిని ఓపెనర్‌గా బరిలోకి దించాలని సెలక్టర్లు భావిస్తున్నారు. కోహ్లికి బ్యాకప్ ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేయాలని ఆలోచిస్తున్నారు. సాధారణంగా రన్ మెషిన్ కోహ్లి వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వస్తాడు. కానీ, కోహ్లి స్ట్రైక్‌రేట్‌ను దృష్టిలో పెట్టుకుని కోహ్లిని ఓపెనర్‌గా పంపించాలని యోచిస్తున్నారు.

టీ20 ఫార్మాట్‌లో భారత్ తరఫున ఓపెనర్‌గా కోహ్లికి మెరుగైన రికార్డు ఉంది. తొమ్మిది మ్యాచ్‌ల్లో ఇన్నింగ్స్ ప్రారంభించిన కోహ్లి 57 సగటుతో 400 పరుగులు సాధించాడు. తన ఓవరాల్ సగటు 51 కంటే ఓపెనర్‌గా వచ్చినప్పుడే విరాట్ ఎక్కువగా పరుగులు చేశాడు. అంతేగాక పొట్టి ఫార్మాట్‌లో అఫ్గానిస్థాన్‌పై కోహ్లి ఓపెనర్‌గానే సెంచరీ సాధించాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లోనూ కోహ్లి ఓపెనర్‌గా సత్తాచాటుతున్నాడు.
కోహ్లి ఏడు మ్యాచ్‌ల్లో 72 సగటుతో 361 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన వీరుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచి ఆరెంజ్ క్యాప్‌ను కూడా అందుకున్నాడు. రోహిత్‌తో పాటు కోహ్లి ఓపెనర్‌గా వస్తే తుదిజట్టు కూర్పు కూడా ఈజీ అవుతుందని సెలక్టర్లు అభిప్రాయపడుతున్నారు. వన్‌డౌన్‌లో సూర్యకుమార్ యాదవ్ వస్తే, ఆ తర్వాతి స్థానాల్లో శిమవ్ దూబె, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య, రింకూ సింగ్‌లతో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ విధ్వంసకరంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
కాగా, అజిత్ అగార్కర్ నేతృత్వంలోని టీమిండియా సెలక్టర్ల కమిటీ రియాన్ పరాగ్‌ను కూడా వరల్డ్ కప్‌కు ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అలాగే పంత్‌కు బ్యాకప్ వికెట్ కీపర్‌గా సంజు శాంసన్ లేదా దినేశ్ కార్తీక్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.