ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలైంది. ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. 2011లో వరల్డ్ కప్ గెలిచిన భారత్.. ఆ తర్వాత మళ్లీ వన్డే వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే.
అంతేకాదు, ఈ మధ్యలో వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇచ్చిన జట్లే ట్రోఫీ ముద్దాడటం కూడా గమనార్హం. ఆస్ట్రేలియాలో జరిగిన వన్డే వరల్డ్ కప్‌ను కంగారూలే గెలిచారు. ఇక ఇంగ్లండ్‌లో జరిగిన వరల్డ్ కప్‌ను ఇంగ్లండ్ జట్టే ముద్దాడింది. ఈ క్రమంలో మళ్లీ భారత్‌లో జరుగుతున్న ఈ వరల్డ్ కప్‌ను భారత్ గెలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ టోర్నీలో భారత జట్టు మొత్తం తొమ్మిది మ్యాచులు ఆడనుంది. వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన స్టేడియాల్లో హైదరాబాద్ మినహా అన్ని వేదికల్లో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 8న తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను భారత్ ఎదుర్కొంటుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక ఆ తర్వాత 11వ తేదీన ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఢీకొంటుంది.
అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా జరిగే మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను భారత్ ఎదుర్కొంటుంది. లక్ష మంది ప్రేక్షకుల కెపాసిటీ ఉన్న నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. లక్ష మంది ముందు జరిగే ఈ మ్యాచ్ కచ్చితంగా వరల్డ్ కప్‌లో హైలైట్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక ఆ తర్వాత 18న పూణేలో బంగ్లాదేశ్, 22న ధర్మశాలలో న్యూజిల్యాండ్, 29న లక్నోలో ఇంగ్లండ్, నవంబర్ 2న ముంబైలో క్వాలిఫైయర్-2, నవంబర్ 5న కోల్‌కతాలో సౌతాఫ్రికా, నవంబర్ 11న బెంగళూరులో క్వాలిఫైయర్-2తో భారత్ ఆడుతుంది. మరి టోర్నీలో ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగుతున్న భారత్ ఎలా ఆడుతుందో చూడాలి.