
ముంబై: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు మరో కీలక ద్వైపాక్షిక సిరీస్ వాయిదా పడే అవకాశం ఉంది. భారత్‌లో జరుగనున్న ఇంగ్లండ్ పర్యటన వాయిదా పడనున్నట్లు బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి బుధవారం ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంగ్లండ్ పర్యటనతో పాటు ఆగస్టులో జరగాల్సిన న్యూజిలాండ్-ఏ పర్యటన సైతం జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్-అక్టోబర్‌లో ఇంగ్లండ్ జట్టు భారత్‌లో పర్యటించాల్సి ఉంది.
కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇంగ్లండ్ జట్టు ప్రయాణించే సూచనలు కనిపించడం లేదు, అందుకే సిరీస్‌ను వాయిదా వేయక తప్పడం లేదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. 'సెప్టెంబర్‌లో భారత్‌తో ఇంగ్లండ్ ఆరు మ్యాచ్‌లు (3వన్డేలు, మూడు టీ20లు)ఆడాల్సి ఉంది. అయితే కరోనా పరిస్థితుల వల్ల ఇంగ్లిష్ జట్టు భారత్‌కు వచ్చే అవకాశాలు లేవు. శుక్రవారం జరిగే సర్వోన్నత మండలి సమావేశంలో ఎఫ్‌టీపీ అంశంపై చర్చించాక భారత్-ఇంగ్లండ్ సిరీస్ వాయిదాపై అధికారిక ప్రకటన రావొచ్చు. ఆగస్టులో భారత్‌లో న్యూజిలాండ్-ఏ పర్యటన సైతం వాయిదా పడొచ్చు' అని బీసీసీఐ అధికారి చెప్పారు.
పరిస్థితులు మెరుగైతే ఆగస్టులో భారత్ శిక్షణ శిబిరం ఏర్పాటు చేయాలని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ భావిస్తున్నారని సదరు బీసీసీఐ అధికారి అన్నారు. కాగా వచ్చే ఏడాది సెప్టెంబర్‌కు భారత పర్యటన వాయిదా పడిందని బ్రిటిష్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక వచ్చే ఏడాది జనవరిలో ఇంగ్లండ్ జట్టు 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు భారత్‌కు రావాల్సి ఉంది. ఇప్పుడు జరగాల్సిన వన్డే, టీ20 సిరీస్‌లను టెస్టు సిరీస్ (జనవరి-ఫిబ్రవరి 2021) సమయంలో నిర్వహించే అవకాశాలు కూడా ఉన్నాయి. 2021 జూలైలో కోహ్లీసేన ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లాల్సి ఉంది.
కరోనా వైరస్ ముప్పుతో మార్చి నుంచి భారత్‌లో ఎలాంటి ఆటలు జరగడం లేదు. అభిమానులు లేకుండా టోర్నీలు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం చెప్పినప్పటికీ.. పరిస్థితులు మాత్రం అనుకూలించడం లేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం బీసీసీఐ సర్వోన్నత మండలి సమావేశం కానుంది. ప్రధానంగా భారత భవిష్య పర్యటన ప్రణాళిక (ఎఫ్‌టీపీ) గురించి చర్చిస్తారని సమాచారం తెలిసింది. వైరస్ కారణంగా దాదాపు నాలుగు నెలలుగా భారత ఆటగాళ్లు క్రికెట్‌కు దూరమయ్యారు. అలాగే ఈ ఏడాది మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 13వ సీజన్ సైతం నిరవధికంగా వాయిదా పడింది.
కరోనా వైరస్ కారణంగా భారత క్రికెట్ జట్టు ఇప్పటికే రెండు పర్యటనలను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఆగస్టులో జింబాబ్వేతో కోహ్లీసేన మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జింబాబ్వే పర్యటన కూడా బీసీసీఐ ఇటీవలే రద్దు చేసింది. అంతకుముందు శ్రీలంక టూర్‌ను కూడా రద్దు చేసుకుంది. షెడ్యూల్ ప్రకారం శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20ల కోసం టీమిండియా శ్రీలంకకు జూన్ 24న ప్రయాణించాల్సి ఉంది. జింబాబ్వేతో ఆగస్టు 22న మూడు వన్డేల సిరీస్ ఆరంభం కావాల్సి ఉంది.