ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. పాకిస్థాన్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుండగా.. టీమిండియా మ్యాచులు దుబాయ్ లో జరగనున్నాయి. ఈ ట్రోఫీని ఎలాగైనా నెగ్గాలని పట్టుదలతో దుబాయ్ లో అడుగుపెట్టిన భారత జట్టు సాధన ప్రారంభించేసింది. గత రెండు రోజుల నుంచి నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తూ ప్రాక్టీస్ చేస్తోంది.
ప్రతీ ఆటగాడు తీవ్రంగా..
అయితే కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, మహ్మద్ షమి, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్ ప్లేయర్స్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ బరిలో దిగనున్నారు. కానీ గత కొంత కాలంగా వీరంతా నిలకడగా రాణించలేకపోతున్నారు. రీసెంట్ గానే ఇంగ్లాండ్ పై వన్డే సిరీస్ తో పాటు రంజీ ట్రోఫీతో కాస్త ఫామ్ లోకి వచ్చారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టులోని ప్రతీ ఆటగాడు సాధనలో తీవ్రంగా చెమటోడ్చుతున్నారు.

దానిపై బాగా ఫోకస్..
వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ భారీ షాట్లు బాదడంపై ఫోకస్ పెట్టాడు. ప్రతీ బంతినీ సిక్స్ బాదేందుకు ప్రయత్నించాడు. 5 లేదా 6వ స్థానంలో అతడు బరిలోకి దిగే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు పేసర్ మహ్మద్ షమి, అర్ష్‌దీప్ సింగ్ బంతులు సంధించారు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య ఆడారు. శ్రేయస్ పవర్ హిట్టింగ్‌పై బాగా ఫోకస్ పెట్టాడు.
పంత్ అసౌకర్యంగానే..
ఆదివారం ప్రాక్టీస్ సెషన్ లో హార్దిక్ పాండ్య బాదిన బంతి తగిలి గాయపడిన పంత్.. సోమవారం నెట్ సెషన్ లో అసౌకర్యంగా కనిపించాడు. వికెట్‌కీపింగ్, ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేయలేదు. బ్యాటింగ్ కూడా అంతగా చేయలేకపోయాడు.