
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఒక ఇంటి వాడయ్యాడు. చాలా కాలంగా డేటింగ్ చేస్తున్న బాలీవుడ్ నటి అతియా శెట్టిని వివాహం చేసుకున్నాడు. ఖండాలాలోని ఒక ఫాంహౌస్‌లో సన్నిహితుల మధ్య ఈ తంతు జరిగింది. ఈ వేడుక అనంతరం కొత్త జంట మీడియా ముందుకు కూడా వచ్చింది. అలాగే తమ పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలను ఇద్దరూ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
తమ పెళ్లి ఫొటోలను షేర్ చేసిన కేఎల్ రాహుల్.. 'నీ వెలుగులో ప్రేమించడం నేర్చుకున్నా. మా సన్నిహితుల మధ్య మేమిద్దరం పెళ్లితో ఒకటయ్యాం. ఇది మాకు ఎంతో సంతోషాన్ని అందించింది. మా భవిష్యత్తు ప్రయాణం కోసం ప్రేమ, కృతజ్ఞతలు నిండిన మనసుతో మీ అందరి ఆశీర్వాదాలు కోరుతున్నాం' అని పోస్టు చేశాడు. దీనిపై పలువురు స్పందించారు. టీమిండియా టీ20 స్పెషలిస్టు సూర్యకుమార్ యాదవ్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తదితరులు కొత్త జంటకు కంగ్రాట్స్ చెప్పారు.
మాజీ క్రికెటర్ సురేష్ రైనా కూడా కొత్త జంటకు విషెస్ చెప్పాడు. రాహుల్‌తో చాలా కాలం కలిసి ఆడిన మయాంక్ అగర్వాల్ అయితే.. 'మీ ఇద్దరూ ఇలా ఒకటవడం చాలా సంతోషంగా ఉంది. కంగ్రాట్స్ గయ్స్' అని పోస్టు పెట్టాడు. కేవలం క్రికెటర్లే కాదు.. కృతి సనన్, విక్కీ కౌశల్, కరీనా కపూర్ వంటి బాలీవుడ్ తారలు కూడా రాహుల్ జంటకు విషెస్ చెప్పారు. పెళ్లి అధికారికంగా ముగిసిందని వెల్లడించిన అతియా తండ్రి సునీల్ శెట్టి.. 'పెళ్లి అయిపోయింది. నేను కూడా ఫాదర్ ఇన్ లా అయిపోయా. నాకైతే ఈ కొత్త పాత్ర కన్నా ఫాదర్‌గా ఉండటమే ఇష్టం. ఆ పాత్ర నేను గొప్పగా పోషించగలను అని నా నమ్మకం' అని చెప్పాడు. రిసెప్షన్ గురించి ప్రశ్నించగా.. కచ్చితంగా నిర్వహిస్తామని, అయితే దాదాపుగా ఐపీఎల్ తర్వాతనే ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పాడు.