126: గాలే టెస్టులో రికార్డు సృష్టించిన శిఖర్ ధావన్
హైదరాబాద్: గాలే వేదికగా శ్రీలకంతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఓ అరుదైన ఘనత సాధించాడు. 190 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరి డబుల్ సెంచరీ మిస్ అయిన ధావన్ టెస్టు క్రికెట్లో ఓ అద్భుతమైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.
టెస్టుల్లో ధావన్‌కి ఇది ఐదో సెంచరీ. ఈ మ్యాచ్‌లో 168 బంతుల్లో 31 ఫోర్ల సాయంతో 190 పరుగులు చేసి డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. 55వ ఓవర్లో ప్రదీప్ వేసిన తొలి బంతిని ఎదుర్కొన్న ధావన్ (190) పరుగుల వద్ద మాథ్యూస్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

రెండో భారత బ్యాట్స్‌మన్
ఒక సెషన్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. టెస్టుల్లో లంచ్ బ్రేక్, టీ విరామం మధ్య 126 పరుగులు చేసి ధావన్ ఓ రికార్డు నెలకొల్పాడు. అంతకు ముందు 2009లో ముంబైలో శ్రీలంకపై వీరేంద్ర సెహ్వాగ్ 133 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు.

మూడో స్ధానంలో వీవీఎస్ లక్ష్మణ్
ఇక మూడో స్ధానంలో వీవీఎస్ లక్ష్మణ్ కొనసాగుతున్నాడు. 2000 సంవత్సరంలో సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరిగిన టెస్టులో లక్ష్మణ్ ఒకే సెషన్‌లో 121 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లుగా ముకుంద్-ధావన్‌లు బరిలో దిగారు.

152వ ఓపెనింగ్ భాగస్వామ్యం
టీమిండియా తరుపున వీరిద్దరిది 152వ ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం విశేషం. వీరిద్దరూ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్లే. ఇంతకు ముందు వరకూ రెండు సందర్భాల్లో మాత్రమే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు భారత్ తరఫున ఓపెనర్లుగా బరిలో దిగారు. 2005లో తొలిసారిగా ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు భారత్ తరుపున ఓపెనింగ్ చేశారు. గంభీర్-పఠాన్ భారత్ తరఫున టెస్టుల్లో ఓపెనింగ్ చేయగా, తర్వాత గంభీర్-ముకుంద్ (2011) ఇంగ్లండ్‌పై ఓపెనింగ్ చేశారు.

ధావన్ షాట్‌కు గాయపడిన లంక క్రికెటర్
శిఖర్ ధావన్ ఆరంభం నుంచే నిలకడగా ఆడుతూ శ్రీలంక బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 31 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌలర్ లాహిరు కుమార బౌలింగ్‌లో ధావన్ కొట్టిన బంతిని.. సెకండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అసేలా గుణరత్నె క్యాచ్‌గా అందుకునేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి వేగం, గమనాన్ని అంచనా వేయడంలో విఫలమైన గుణరత్నె తడబడ్డాడు. ఈ తడబాటుతో అతని ఎడమచేతి బొటనవేలిని చీల్చుకుంటూ బంతి వెళ్లిపోయింది. దీంతో ప్రాథమిక చికిత్స అనంతరం గుణరత్నెని కొలంబోకి సర్జరీ కోసం తరలించినట్లు శ్రీలంక చీఫ్ సెలక్టర్ సనత్ జయసూర్య వెల్లడించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications