టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ గ్యాస్ట్రోఎంటెరైటిస్ కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. డిసెంబర్ 16న యావత్ దేశం ఐపీఎల్ మినీ వేలంతో బిజీగా ఉన్న సమయంలో ఈ క్రికెటర్ ఆసుపత్రి పాలయ్యారు. ప్రస్తుతం యశస్వి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టు తరఫున ఆడుతున్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సూపర్ లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై ముంబై విజయం సాధించిన కొన్ని గంటల తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ మ్యాచ్‌లో జైస్వాల్ 16 బంతుల్లో 15 పరుగులు చేశారు.
సమాచారం ప్రకారం.. మ్యాచ్ అనంతరం యశస్వి జైస్వాల్‌కు తీవ్రమైన కడుపు నొప్పి మొదలైంది, ఇది క్రమంగా పెరిగింది. దీంతో వెంటనే అతడిని పింప్రి-చించ్‌వాడ్‌లోని ఆదిత్య బిర్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతనికి తీవ్ర గ్యాస్ట్రోఎంటెరైటిస్ (అంటే పొట్ట, పేగుల వాపు)గా నిర్ధారించారు. జైస్వాల్‌కు ఆసుపత్రిలో ఐవీ (ఇంట్రావీనస్) మందులు ఇచ్చారు. అలాగే అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ కూడా నిర్వహించారు. అనంతరం వైద్యులు అతనికి మందులు కొనసాగించాలని, విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో యశస్వి జైస్వాల్ ప్రదర్శన
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జైస్వాల్ మూడు మ్యాచ్‌లలో 48.33 సగటు, 168.6 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 145 పరుగులు సాధించాడు. ఈ దేశవాళీ టీ20 టోర్నమెంట్‌కు ముందు యశస్వీ జైస్వాల్ దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాల్గొని 78 సగటుతో 156 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు.
ముంబై విజయానికి రహానే, సర్ఫరాజ్ మెరుపులు
మంగళవారం పుణేలో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సూపర్ లీగ్ గ్రూప్ B మ్యాచ్‌లో అజింక్య రహానే (నాటౌట్ 72), సర్ఫరాజ్ ఖాన్ (22 బంతుల్లో 73) మెరుపు ఇన్నింగ్స్‌ల సహాయంతో ముంబై మూడు వికెట్ల తేడాతో రాజస్థాన్‌ను ఓడించింది. రహానే 41 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 72 పరుగులు చేశాడు. అయితే అసలైన మ్యాజిక్ సర్ఫరాజ్ ఖాన్ చేశాడు. కేవలం 22 బంతుల్లో 7 సిక్సర్లు, 6 ఫోర్లతో 73 పరుగులు చేసి తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. మరోసారి 200 పరుగులకు పైగా ఉన్న లక్ష్యాన్ని ఛేదించింది ముంబై. 217 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ముంబై, వరుసగా వికెట్లు కోల్పోయినా ఆటను కొనసాగించి 11 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.
ముంబై జట్టు రహానే, జైస్వాల్ (15) మధ్య 41 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం తర్వాత జైస్వాల్ వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత రహానే, సర్ఫరాజ్ ఖాన్‌తో కలిసి కేవలం 39 బంతుల్లో 111 పరుగుల ధనాధన్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సర్ఫరాజ్ ఖాన్ (4-0-23-3) మానవ్ సుతార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. సర్ఫరాజ్ మెరుపు ఇన్నింగ్స్ తర్వాత ముంబై కొన్ని వికెట్లను త్వరగా కోల్పోయినా, చివరికి విజయాన్ని సాధించింది.