ముంబై: ఫొటోలో కనిపిస్తోన్న ఈ భారత జట్టు ప్లేయర్ ఎవరో గుర్తు పట్టేసే ఉంటారు. ఓపెనర్ శిఖర్ ధావన్. ప్రస్తుతం జట్టులో లేడు. వరల్డ్ కప్ 2023 ఆడట్లేదు. ఈ మెగా టోర్నమెంట్‌కు దూరం అయ్యాడు. వరల్డ్ కప్ టోర్నమెంట్‌కే కాదు.. అంతర్జాతీయ మ్యాచ్‌లల్లోనూ చాలాకాలంగా కనిపించట్లేదీ గబ్బర్.
2022లో చివరిసారిగా తన వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు శిఖర్ ధావన్. బంగ్లాదేశ్‌తో సిరీస్ అది. 2022 డిసెంబర్ 10వ తేదీన చిట్టాగాంగ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కనిపించాడు. అప్పటికే టీ20లకూ దూరం అయ్యాడు. 2021 శ్రీలంకలో పర్యటించిన జట్టుకు కేప్టెన్‌గా వ్యవహరించాడు. జులై 29వ తేదీన కొలంబోలో ఆడిన మ్యాచ్.. అతని చివరి టీ20.

2018 నుంచీ టెస్ట్ మ్యాచ్‌లల్లో అతనికి చోటు దక్కట్లేదు. చివరిసారిగా 2018 సెప్టెంబర్ 7వ తేదీన ఓవల్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో మెరిశాడు. ప్రస్తుతం మూడు ఫార్మట్లకూ దూరం అయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లల్లో మాత్రం అతని హవా కొనసాగుతోంది.
ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ జట్టుతో కొనసాగుతోంది అతని ఐపీఎల్ ప్రయాణం. ఐపీఎల్ 2023 సీజన్‌లో నిలకడగా రాణించాడు. 11 మ్యాచ్‌లల్లో 99 హయ్యెస్ట్ స్కోర్‌తో 373 పరుగులు చేశాడు. 41.44 స్ట్రైక్ రేట్‌ను నమోదు చేశాడు. ఈ ఒక్క సీజన్‌లోనే మూడు అర్ధసెంచరీలను అందుకున్నాడు శిఖర్ ధావన్.
ప్రస్తుతం టీమిండియా ఓపెనింగ్ బాధ్యతలను యంగ్ క్రికెటర్లు అందిపుచ్చుకున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. చాలామందే ఓపెనర్లుగా రాణిస్తోన్నారు. రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్‌ను ఆరంభించడానికి శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్.. వంటి యంగ్ ప్లేయర్లు పోటీ పడుతున్నారు.
ఈ పరిస్థితుల్లో కొత్త యువ రక్తాన్ని తట్టుకుని నిలబడటానికి, జట్టులో మళ్లీ చోటు దక్కించుకోవడానికి శిఖర్ ధావన్ చెమటోడుస్తోన్నాడు. జిమ్‌లో అతని వర్కవుట్స్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోన్నాయి. అతని వయస్సు 37 సంవత్సరాలు. అయినప్పటికీ- కండలు తిరిగిన శరీరంతో కనిపిస్తోన్నాడు శిఖర్. సిక్స్ ప్యాక్స్‌ను సాధించాడు. తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.