
2021 సంవత్సరానికి బైబై చెబుతూ 2022 సంవత్సరానికి వెల్‌కమ్ చెప్పింది ప్రపంచం. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన సంబరాలు ఆకట్టుకున్నాయి. ఆకాశంలో మరో అద్బుతం ఏమైనా ఆవిష్కరించిందా అనే స్థాయిలో టపాసులు, అంతకు మించిన లైట్ షోలతో సంబరాలు అదిరిపోయేలా సాగాయి. ప్రతిసారి లాగే ఈ సారి కూడా కొత్త సంవత్సరానికి అందిరి కంటే ముందుగా న్యూజిలాండ్ గ్రాండ్ వెల్‌కమ్ చెప్పింది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు కూడా కొత్త సంవత్సరానికి తమదైన రీతిలో వెల్‌కమ్ చెప్పింది. ప్రస్తుతం సెంచూరియన్‌లోని ఓ హోటల్‌లో బస చేస్తున్న భారత జట్టు అక్కడే అదిరిపోయే రేంజులో కొత్త సంవత్సరం సంబరాలు చేసుకుంది.
హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌తోపాటు కెప్టెన్ కోహ్లీతో సహా టీంలోని మొత్తం సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. టీం సహాయక బృందం కూడా ఈ వేడులకల్లో పాలు పంచుకుంది. ఈ వేడుకల్లో ఆటగాళ్లంతా ప్రత్యేక ఆకర్శణగా నిలిచారు. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ నీలిరంగు చొక్కా, నీలిరంగు జీన్స్ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చాడు. మహ్మద్ షమీ, అజింక్యా రహానే, ఛెతేశ్వర్ పుజారాలతో కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లి తెల్లటి టీ షర్ట్ ధరించి సంబరాలు చేసుకున్నాడు.
రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, దీపక్ చాహర్, ప్రియాంక్ పాంచల్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. ఈ వేడుకల్లో ఆరంభంలో కనిపించని కెప్టెన్ కోహ్లీ చివర్లో వచ్చి తనదైన శైలిలో క్రికెట్ ఫ్యాన్స్‌కు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాడు. కాగా ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను ప్రియాంక్ పాంచల్, అశ్విన్‌లు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
అశ్విన్, ప్రియాంక్ పాంచల్ షేర్ చేసిన ఈ ఫోటోల్లో అందరూ విన్నింగ్ సింబల్ చూపిస్తూ సంతోషంతో నవ్వుతూ కనిపిస్తున్నారు. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్ రిషబ్ పంత్ చివరి వరుసలో ఉన్నారు. కాగా 2021ని విజయంతో ప్రారంభించిన టీమిండియా.. విజయంతోనే ముగించింది. 2021 ఆరంభంలో మెల్‌బోర్న్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో గెలిచిన భారత జట్టు.. 2021 చివర్లో సెంచూరియన్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లోనూ విజయం సాధించి సంవత్సరాన్ని ఘనంగా ముగించింది.
అయితే ఈ రెండు టెస్ట్ మ్యాచ్ విజయాలు భారత జట్టు విదేశాల్లోనే సాధించడం విశేషం. కాగా ప్రస్తుత సౌతాఫ్రికా పర్యటనలో తొలి టెస్ట్ మ్యాచ్‌లో విజయం సాధించిన భారత జట్టు.. ఈ నెల 3 నుంచి జోహన్నెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో రెండో టెస్టు మ్యాచ్‌లో తలపడనుంది.