ఛాంపియన్స్ ట్రోఫీ: ఏం జరుగుద్దో, ఫ్యాన్స్, కోహ్లీసేనకు బోర్డు షాక్?
హైదరాబాద్: బీసీసీఐ... క్రికెట్ అభిమానులతో పాటు ఆటగాళ్లకు షాకివ్వనుందా? అంటే అవుననే తెలుస్తోంది. ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లాండ్‌లో జరగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకోబోతున్నట్టు బీసీసీఐ ప్రకటించే అవకాశముందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
శుక్రవారం దుబాయిలో ఐసీసీ బోర్డు సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో బీసీసీఐ తరుపున కొత్తగా బోర్డు సభ్యుడిగా ఎంపికైన విక్రమ్ లిమాయేతో పాటు సెక్రటరీ అమితాబ్ చౌదురి పాల్గొన్నారు. ఈ సమావేశంలో అంతర్జాతీయ క్రికెట్‌లో నిర్మాణాత్మక మార్పులు కోసం చర్చలు జరుగుతున్నాయి.
ఈ భేటీలో ప్రధానమైన బిగ్ 3 రెవెన్యూ ఫార్ములాను రద్దు చేయాలని ఐసీసీ సభ్యులు ప్రతిపాదించనున్నారు. దానికి సభ్యుల నుంచి ఆమోదం లభిస్తే ఐసీసీ నుంచి బీసీసీఐకి వచ్చే నిధుల్లో భారీగా కోత పడనుంది. ప్రస్తుతం బిగ్ 3 రెవెన్యూ ఫార్ములా ప్రకారం ఐసీసీ నుంచి బీసీసీఐ 20.3 శాతం నిధులు పొందుతుంది.
ఈ క్రమంలో 'బిగ్ త్రీ రెవెన్యూ వ్యవస్థ'ను కాపాడుకునేందుకు జూన్‌లో ఇంగ్లాండ్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ బహిష్కరణను చివరి అస్త్రంగా బోర్డు ప్రయోగించనుంది. అంతేకాదు ఈ బిగ్ 3 రెవెన్యూ ఫార్ములాను ఐసీసీ రద్దు చేస్తే దాని ప్రభావం భారత క్రికెట్‌కు కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌పై కూడా పడుతుందని బోర్డు ఆందోళన వ్యక్తం చేస్తోంది.

కొత్త రెవెన్యూ ప్రతిపాదనలు
క్రికెట్‌లో మూడు ఫార్మాట్లనూ మరింత ప్రోత్సహించేందుకు ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ (సీఈసీ) ఇప్పటికే కొన్ని కొత్త ప్రతిపాదనలను ఆమోదించింది. ఇందులో మొదటది రెండేళ్ల కాలానికి రెండంచెల టెస్టు లీగ్, 13 జట్లతో వన్డే లీగ్‌తో పాటు టీ20 వరల్డ్‌కప్ కోసం రీజినల్ క్వాలిఫికేషన్ నిర్వహించాలని ప్రతిపాదించింది.

అఫ్ఘానిస్థాన్, ఐర్లాండ్‌లకు టెస్టు హోదా
ఇక రెండోది అఫ్ఘానిస్థాన్, ఐర్లాండ్‌లకు టెస్టు హోదా, ఏడాదికో ఐసీసీ ఈవెంట్ నిర్వహించేలా కొత్త అంశాన్ని తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో బిగ్ త్రీ రద్దుకే బోర్డు భేటీలో మొగ్గు చూపనున్నారు. ఇదే గనుక జరిగితే టెస్టు, వన్డే లీగ్‌లు, టీ20 క్వాలిఫయర్స్ ప్రతిపాదనలతో ఐపీఎల్‌కు సమయం తగ్గిపోనుంది.

ఐపీఎల్ ఆడేందుకు ఆటగాళ్లకు తక్కువ సమయం
తద్వారా బీసీసీఐకి కాసుల వర్షం కురిపిస్తున్న ఐపీఎల్ ఆడేందుకు ఆటగాళ్లకు తక్కువ సమయం లభిస్తుంది. ఒకవేళ శనివారం జరిగే ఐసీసీ సమావేశంలో బిగ్ త్రీ రద్దు అయినప్పటికీ బీసీసీఐకి రూ. 2500 కోట్లు లభిస్తాయని క్రికెట్ నిపుణులు అంటున్నారు.

బీసీసీఐ ఆదాయంలో ఆరు శాతం కోత పెడితే సరి
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహార్ ఇదే విషయాన్ని వెల్లడించారు. ఉదాహరణకు క్రికెట్‌లో చిన్న దేశాలైన బంగ్లాదేశ్, జింబాబ్వే ఎనిమిదేళ్ల సైకిల్‌లో రూ. 33.61 కోట్లు, 20 కోట్లు దక్కించుకుంటాయి. అదే సమయంలో భారతకు వచ్చే మొత్తం రూ. 3400 కోట్లు. బీసీసీఐ ఆదాయంలో ఆరు శాతం కోత పెట్టి దాన్ని బిగ్ త్రీలోని దేశాలకు పంచితే సరిపోతుందన్నారు.

అసలు బిగ్ 3 అంటే ఏమిటి?
గతంలో ఐసీసీలో శాశ్వత సభ్యులైన పది టెస్టు దేశాలకు సమానంగా నిధులు (ఒక్కొక్కరి 67 మిలియన్ డాలర్లు) ఇచ్చేది. అయితే ఐసీసీకి భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాల నుంచే ఐసీసీకి పెద్ద మొత్తంలో ఆదాయం వస్తోంది. అందువల్ల ఐసీసీ ఆదాయంలో ఈ మూడు దేశాలకుమెజారిటీ వాటానివ్వాలని 2014లో అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ బిగ్ త్రీ మోడల్‌ను ప్రతిపాదించారు.

బీసీసీఐ వ్యతిరేకత
ఈ మూడు నుంచి ఐసీసీకి వచ్చే మొత్తం ఆధారంగా ఆదాయాన్ని పంచాలని ఆయన సూచించారు. అయితే, 2015లో ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికైన తర్వాత శశాంక్ మనోహర్ ఈ బిగ్ 3 మోడల్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. చిన్న దేశాల్లో క్రికెట్‌కు ఊతమిచ్చేందుకు బిగ్ 3 స్థానంలో కొత్త రెవెన్యూ ఫార్ములాను ప్రతిపాదించారు. దీనిని ఇప్పుడు బీసీసీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications