
హైదరాబాద్: వరుసగా పదో టెస్టు సిరిస్‌ను గెలవాలనే లక్ష్యంతో సఫారీ గడ్డపై అడుగుపెట్టిన కోహ్లీసేనను బ్యాటింగ్ వైఫల్యం తీవ్రంగా వేధిస్తోంది. బౌలర్లు రాణించినప్పటికీ, బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 0-2తో చేజార్చుకుంది. ముఖ్యంగా ఈ సిరిస్‌లో భారత బ్యాట్స్‌మెన్ ఆటతీరు తీసికట్టుగా తయారైంది.
తద్వారా టీమిండియా 34 ఏళ్ల తర్వాత ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకే ఆలౌటైన కోహ్లీసేన రెండో ఇన్నింగ్స్‌లో 135 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో తొలి టెస్టులో 72 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
ఇక, సెంచూరియన్ వేదికగా ప్రారంభమైన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగడంతో 280 పరుగులుచేసింది. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో 87 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టీమిండియా ఇలా వంద పరుగులలోపు ఇంత తక్కువ వ్యవధిలో మూడుసార్లు ఏడు వికెట్లను కోల్పోవడం గత 34 ఏళ్లలో ఇదే తొలిసారి.
1983-84లో వెస్టిండీస్‌పై స్వదేశంలో జరిగిన టెస్టు సిరిస్‌లో ఇలా వంద లోపు పరుగులకే వికెట్లను కోల్పోయింది. బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో మళ్లీ ఇన్నాళ్లకు చెత్త రికార్డుని నమోదు చేసింది. టెస్టుల్లో నెంబర్ వన్ స్ధానంలో ఉన్న టీమిండియా ప్రస్తుతం ఆ స్ధాయి మేరకు ప్రదర్శన చేయడం లేదు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.