అంటిగ్వా : గురువారం నాడు ప్రారంభం కాబోయే భారత్-విండీస్ టెస్టు సిరీస్ పై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కోచ్ గా కుంబ్లే ఎంట్రీ.. టీ20 ఫీవర్ నుంచి బయటపడ్డాక ఆడబోతున్న టెస్టులు కావడం.. సిరీస్ పై మరింత ఆసక్తిని నెలకొల్పతున్నాయి.
ఇకపోతే విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ మాత్రం సిరీస్ ఫేవరేట్ టీమ్ ఇండియా అంటున్నాడు. నాలుగు టెస్టుల సిరీస్ ఆడడం తనకు ఇదే మొదటిసారి అని చెప్పిన హోల్డర్.. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లోను టీమ్ ఇండియా పటిష్టంగా ఉందన్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ ఓటమికి కారణాలు వివరిస్తూ.. అనుభవలేమి కారణంగానే సిరీస్ ఓటమి పాలయ్యామని తెలిపాడు. ఆస్ట్రేలియా సిరీస్ నుంచి పాఠాలు నేర్చుకున్నామని, అయితే ఆటలో ఇంకా రాణించాల్సిన అవసరముందని అన్నాడు.

మందకొడిగా ఉండే పిచ్ లపై రాణించాలంటే చెమటోడ్చక తప్పదంటున్నాడు హోల్డర్. ఇక టీమ్ ఇండియా విషయానికొస్తే.. ఒకవేళ భారత్ టెస్టు సిరీస్ ను నెగ్గితే కోహ్లి సారథ్యంలో జట్టు హ్యాట్రిక్ సిరీస్ నమోదు చేసుకుంటుంది. గతేడాది శ్రీలంక, దక్షిణాఫ్రికాలపై టీమ్ ఇండియా సిరీస్ లు నెగ్గిన విషయం తెలిసిందే.
సిరీస్ నెగ్గితే.. విండీస్ పై కూడా భారత్ కు ఇది వరుసగా మూడో విక్టరీ అవుతుంది. సిరీస్ నేపథ్యంలో బ్యాటింగ్, బౌలింగ్ లో పటిష్టంగా ఉన్న భారత్ లైనప్ ను ఎదుర్కోవడానికి విండీస్ ఆందోళన చెందుతున్నట్లుగానే కనిపిస్తోంది.