Manchester Test: మాంచెస్టర్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రోజు ఆటలో బ్యాటింగ్ చేస్తూ రిషబ్ పంత్ గాయపడ్డాడు. పంత్ గాయం తీవ్రంగా ఉండడంతో వెంటనే స్కానింగ్ కోసం ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. అయితే అనూహ్యంగా మ్యాచ్ రెండో రోజు తన గాయాన్ని లెక్క చేయకుండా బ్యాటింగ్ చేసి అర్థ సెంచరీని నమోదు చేశాడు. వికెట్ కీపింగ్ బాధ్యతలను మాత్రం ధ్రువ్ జురేల్ కు అప్పగించాడు. ఇంగ్లాండ్ జట్టు 311 పరుగులు ఆధిక్యంలో నిలిచింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 174 పరుగులతో కొనసాగుతోంది. క్రీజులో కేఎల్ రాహుల్(87 ), శుభ్‌మన్ గిల్ (78) ఉన్నారు. ఈ కీలక మ్యాచ్ లో ఓడిపోకుండా ఉండాలంటే రెండు సెషన్ల పాటు బ్యాటింగ్ చేసి అదనంగా 200 పరుగులు చేయాల్సిందే. అలా జరగాలంటే క్రీజులోని బ్యాటర్లు ఇంగ్లాండ్ బౌలర్లను ఈ రోజంతా ఎదుర్కోవాలి. గిల్, రాహుల్ తర్వాత ప్రధాన బ్యాటర్ గా ఉంది రిషబ్ పంత్ మాత్రమే. ఈ క్రమంలో భారత జట్టు కోసం రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తాడా అనే విషయంపై ఇప్పుడు కీలక అప్ డేట్ వచ్చింది.
రిషబ్ పంత్ గాయంపై కీలక అప్‌డేట్
భారత్ తమ ఇన్నింగ్స్‌ను ప్రారంభించగానే 0 పరుగులకే 2 కీలక వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. అయితే, ఆ తర్వాత ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్, కెప్టెన్ శుభమన్ గిల్ బాధ్యతాయుతమైన ఆటతో జట్టును ఆదుకోవడమే కాకుండా, సెంచరీ భాగస్వామ్యం కూడా నెలకొల్పారు. ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, ఐదో రోజు ఆటలో భారత్ రాహుల్, గిల్ వికెట్లను కోల్పోతే, గాయపడిన రిషబ్ పంత్ బ్యాటింగ్ చేయడానికి వస్తాడా? సమాచారం ప్రకారం, రిషబ్ పంత్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాడు. ఈ విషయాన్ని టీమిండియా బ్యాటింగ్ కోట్ సితాన్హు కోటక్ ధ్రువీకరించాడు. ఆఖరి రోజు బ్యాటింగ్ చేసేందుకు పంత్ సిద్ధంగా ఉన్నాడని చెప్పాడు. అంటే జట్టుకు అవసరమైన సందర్భంలో రిషబ్ పంత్ బ్యాటింగ్‌కు దిగడానికి వెనుకాడడని స్పష్టమవుతోంది. ఇది భారత అభిమానులకు నిజంగా శుభవార్త.

క్రిస్ వోక్స్ బంతికి పంత్ ఎలా గాయపడ్డాడు?
క్రిస్ వోక్స్ బంతికి రిషబ్ పంత్ గాయపడటం మొదటి ఇన్నింగ్స్‌లో జరిగింది. మొదటి ఇన్నింగ్స్‌లోని 68వ ఓవర్‌లో, పంత్ వోక్స్ బంతికి రివర్స్ స్వీప్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే, బంతి నేరుగా పంత్ కాలికి బలంగా తగిలింది, దీంతో అతను నొప్పికి విలవిల్లాడి రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. గాయం తీవ్రత దృష్ట్యా రిషబ్ పంత్ మొదటి రోజు బ్యాటింగ్ కొనసాగించలేకపోయాడు. వెంటనే స్కానింగ్ కోసం ఆసుపత్రికి వెళ్లాడు.
అయినప్పటికీ, ఆశ్చర్యకరంగా ఆట రెండో రోజు అతను బ్యాటింగ్‌కు దిగి భారత జట్టు కోసం అద్భుతంగా రాణించాడు. 75 బంతుల్లో 54 పరుగులతో విలువైన అర్ధ సెంచరీని సాధించి జట్టుకు అండగా నిలిచాడు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు ఇంగ్లాండ్ స్కోరు కంటే 137 పరుగులు వెనుకబడి ఉంది. ఈ పరిస్థితుల్లో, రెండో ఇన్నింగ్స్‌లో కూడా రిషబ్ పంత్ నుండి భారత జట్టు మంచి ప్రదర్శనను ఆశిస్తోంది. జట్టుకు అవసరమైన పక్షంలో రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తాడని వచ్చిన అప్‌డేట్ ఊరటనిచ్చే అంశం.