ముంబై: చారిత్రాత్మక 500వ టెస్టుకు భారత్ సిద్ధమైంది. న్యూజిలాండ్ జట్టుతో ఆడబోతున్న ప్రతిష్టాత్మక 500వ టెస్టు మ్యాచ్‌ను చిరకాలం గుర్తుంచుకునే ఏర్పాట్లు చేయడంలో బీసీసీఐ మునిగిపోయింది. కోహ్లీ నేతృత్వంలోని యువ జట్టుకు ఈ గోల్డెన్ ఛాన్స్ దక్కింది.
ఈ నెల 22న జరగనున్న టెస్ట్ టీమిండియాకు 500వది కావడం విశేషం. క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన నాలుగో జట్టుగా భారత్ నిలిచింది. ఇప్పటివరకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లు మాత్రమే 500కుపైగా టెస్టులు ఆడిన ఘనతను సొంతం చేసుకున్నాయి. దీంతో చారిత్రాత్మక టెస్టు కోసం కోహ్లి సేన ప్రత్యేకంగా సిద్ధమవుతోంది.
500వ టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు ప్రత్యేకంగా ఫొటోషూట్స్‌కు పోజులిస్తున్నారు. 500వ టెస్ట్‌కు మేం సిద్ధం మీరు సిద్ధమా అంటూ అభిమానులను చీర్ చేస్తున్నారు. కాన్పూర్‌లోని గ్రీన్‌పార్క్ స్టేడియం ఈ చారిత్రక మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది. మ్యాచ్ నేపథ్యంలో ఇండియా, న్యూజిలాండ్ జట్లు ఇక్కడికి చేరుకున్నాయి.
ఈ చారిత్రాత్మక టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా మాజీ కెప్టెన్లు, క్రికెటర్లు, కోచ్‌లు, బోర్డుల అధ్యక్షులు, సభ్యులు ఇలా ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్న బీసీసీఐ ఆ రోజు విందును ప్రత్యేకంగా, చిరకాలం గుర్తుంచుకునేలా సుమారు 500 వంటకాలతో ఏర్పాటు చేయనుంది.
ఇప్పటికే ఆ మ్యాచ్ రిఫరీగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ సునీల్ యాదవ్‌ను ఐసీసీ నియమించింది. గురువారం నుంచి ఈ మ్యాచ్ కాన్పూర్ వేదికగా జరగనుంది. ఇక వెస్టిండీస్‌లో సిరీస్ విజయంతో ఊపు మీదున్న కోహ్లి సేన సొంతగడ్డపై జరగనున్న ఈ హిస్టారిక్ మ్యాచ్‌ను గెలిచి 500వ టెస్ట్ వేడుకను మరింత మధురంగా మలచాలని భావిస్తోంది.