ఉప్పల్ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. టీ విరామానికి ఇంగ్లాండ్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. టీమిండియా స్పిన్నర్ల ధాటికి ఇంగ్లాండ్ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోతున్నారు. అయితే టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు స్పిన్ పిచ్‌లపై కూడా బజ్‌బాల్ ఆడతామని ప్రకటించిన ఇంగ్లాండ్.. ప్రస్తుతం సింగిల్స్ తీయడానికి కూడా కష్టపడుతోంది. బజ్‌బాల్ బ్యాటింగ్ విధానం ప్రారంభించిన తర్వాత ఇంగ్లాండ్ నెలకొల్పిన అతితక్కువ రన్‌నేటు ఇన్నింగ్స్ ఇదే కావడం గమనార్హం.
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. దూకుడుగానే ఇన్నింగ్స్ ఆరంభించింది. పరుగులు వేగంగా సాధిస్తూ పేసర్లపై ఒత్తిడి పెంచింది. దాంతో కెప్టెన్ రోహిత్ స్పిన్నర్లకు బంతిని అందించాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ కథ మారిపోయింది. మన బౌలర్లు బంతుల్ని గింగరాలు తిప్పడంతో ఇంగ్లాండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. 55/0తో మెరుగైన స్థితిలో ఉన్న ఇంగ్లిష్ జట్టు కాసేపటికే 60/3కి చేరుకుంది. అయిదు పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది.

అనంతరం క్రీజులోకి వచ్చిన జో రూట్ (29; 60 బంతుల్లో), బెయిర్ స్టో (37; 58 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. 108/3తో లంచ్ విరామానికి వెళ్లారు. కానీ రెండో సెషన్ ఆరంభంలోనే ఇంగ్లాండ్‌కు భారత్ స్పిన్నర్లు షాకిచ్చారు. కుదురుకున్న వారిద్దరిని పెవిలియన్‌కు చేర్చి గట్టిదెబ్బ కొట్టారు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా ఎక్కువ సేపు నిలవలేకోయారు.

ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టును నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. భారత్‌లో బజ్‌బాల్ కుదరదని, పక్కకెళ్లి ఆడుకోమని పోస్టులు పెడుతున్నారు. ఇతర దేశాల్లో పరుగులు సాధించినట్లుగా ఇండియాలో చేయలేరని ఎద్దేవా చేస్తున్నారు. 'మీది బజ్‌బాల్ అయితే, మాది స్పిన్ బాల్' అని కామెంట్లు చేస్తున్నారు. కొందరు ప్రేక్షకులు ఉప్పల్ స్టేడియంలోనే ఇంగ్లాండ్ జట్టుపై విమర్శలు చేస్తున్నారు. 'వైట్ బాల్, రెడ్ బాల్ ఉంది.. మీ బజ్ బాల్ ఎక్కడా?' అని నినాదాలు చేస్తున్నారు.