Women's T20 World Cup : ఈ మూడు సమస్యలు తీరకపోతే.. వరల్డ్ కప్‌లో టీమిండియాకు మళ్లీ ఓటమి తప్పదు!

టీ20 వరల్డ్ కప్‌లో భారత మహిళల జట్టు వరుసగా మూడోసారి సెమీఫైనల్ చేరింది. ఐర్లాండ్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో స్మృతి మంధాన హాఫ్ సెంచరీతో రాణించింది. అయితే ఛేజింగ్‌లో ఐర్లాండ్ అమ్మాయిలు ధాటిగా ఆడుతున్న సమయంలో వర్షం పడింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత జట్టు గెలిచింది. కానీ భారత జట్టులో మూడు ప్రధాన సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించకపోతే భారత్ మరోసారి కప్పు కొట్టకుండానే వెనుతిరగాల్సి వస్తుంది.

స్పిన్నర్ల ఫామ్..
సౌతాఫ్రికాలో పరిస్థితులను దాదాపు అన్ని దేశాల స్పిన్నర్లు ఎంజాయ్ చేస్తున్నారు. చక్కగా రాణిస్తున్నారు. కానీ భారత స్పిన్నర్లు మాత్రం నిలకడగా రాణించడం లేదు. రాజేశ్వర్ గైక్వాడ్ ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. అదే సమయంలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో స్పిన్నర్ దీప్తి శర్మ అద్భుతంగా రాణించినా.. ఇంగ్లండ్‌తో మ్యాచులో 37 పరుగులు ఇవ్వడం గమనార్హం. రాధా యాదవ్ చక్కగా బౌలింగ్ చేస్తున్నా.. మిగతా స్పిన్నర్ల ప్రదర్శన లేకపోవడం జట్టును బాధిస్తోంది. ఇది చూసిన చాలా మంది స్నేహ్ రాణా వంటి స్పిన్నర్‌ను జట్టులోకి తీసుకోకపోవడంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రేణుకా సింగ్‌కు సపోర్ట్ ఇచ్చే బౌలర్ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది.

మిడిలార్డర్‌లో బలం లేదు
టీమిండియా బ్యాటింగ్‌లో కూడా పెద్ద సమస్య కనిపిస్తోంది. మిడిలార్డర్‌లో రిచా ఘోష్ అద్బుతంగా రాణిస్తున్నా.. ఆమెకు సహకారం అందించే బ్యాటర్లు కరువయ్యారు. పాకిస్తాన్, వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచుల్లో కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడింది. జట్టులో ఐదో స్థానాన్ని ఆమె సెటిల్ చేసుకుంది. కానీ ఆమెకు లోయర్ మిడిలార్డర్ నుంచి సరైన మద్దతు దొరకడం లేదు. ఇంగ్లండ్‌తో మ్యాచులో చివరి 14 బంతుల్లో 34 చేయాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాతి 8 బంతుల్లో భారత బ్యాటర్లు కేవలం 3 పరుగులే చేయగలిగింది. అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా ప్రేక్షకులకు అర్థం కాలేదు. దీప్తి శర్మ, పూజ వస్త్రాకర్ తదితరులు బ్యాటుతో రాణించాల్సిన అవసరం చాలా ఉంది.

మంధానపై మరీ భారం..
భారత మహిళల జట్లు మరీ ఎక్కువగా స్మృతి మంధానపై ఆధారపడుతోంది. తప్పక గెలవాల్సిన ఐర్లాండ్ మ్యాచులో కూడా ఆమె ఒక్కతే 87 పరుగులతో రాణించింది. మిగతా ఆటగాళ్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. ముఖ్యంగా టాపార్డర్‌లో బ్యాటర్లు పరుగులు చేయడానికి కష్టపడటం ఆందోళన కలిగించే అంశం. ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓడిన మ్యాచ్ దీనికి సరైన ఉదాహరణ. భారీ షాట్లు ఆడే షెఫాలీ వర్మ జిడ్డు బ్యాటింగ్ చేస్తుండటం కూడా సమస్యగా మారింది. దీని వల్ల స్మృతి మంధానపై ఒత్తిడి పెరుగుతోంది. ఐర్లాండ్‌పై మూడో స్థానంలో వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా నెమ్మదిగానే బ్యాటింగ్ చేసింది. జెమీమా రోడ్రిగెజ్ కొంత ఫామ్ అందుకున్నా కూడా నిలకడగా ఆడాల్సి ఉంది. ఈ సమస్యలన్నీ పరిష్కరించుకుంటేనే భారత జట్టు ఈసారైనా ట్రోఫీ ముద్దాడేది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications