
నాటింగ్‌హామ్: అతి భారీ వర్షాల కారణంగా అతలాకుతలమైన కేరళకు టీమిండియా భారీ విరాళం ప్రకటించింది. కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా నాటింగ్‌హామ్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా 203 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఈ మ్యాచ్‌కు ఆటగాళ్లు అందుకోనున్న మొత్తం మ్యాచ్ ఫీజుల్ని కేరల వరద బాధితుల కోసం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించామని తెలిపాడు. ఈ మొత్తం రూ.1.26 కోట్లని సమాచారం. అంతేకాదు మ్యాచ్ విజయాన్ని సైతం కేరళకు అంకితమిస్తున్నట్టు విరాట్ కోహ్లీ ప్రకటించాడు.
"ఈ మ్యాచ్‌లో గెలిచి కేరళ వరద బాధితులకు అంకితమివ్వాలని ముందే నిర్ణయించుకున్నాం. అక్కడి పరిస్థితి దారుణంగా ఉంది. భారత క్రికెట్ జట్టు తరఫున వారికోసం మేం చేయగలిగిన చిన్న పని ఇది. ఇక మాకు ఈ విజయం అత్యవసరం. అభిమానులకు జట్టుపై నమ్మకం పోయినా మా సామర్థ్యంపై మేం విశ్వాసాన్ని కోల్పోలేదు" అని కోహ్లీ అన్నాడు.
"ట్రెంట్‌బ్రిడ్జ్‌లో తొలుత భారీగా పరుగులు సాధించి బౌలర్ల రాణింపుతో ప్రత్యర్థిని కట్టడి చేశాం. స్లిప్స్‌లో క్యాచ్‌లు కూడా కీలకంగా నిలిచాయి. రహానేతో నా భాగస్వామ్యం మ్యాచ్‌ను మలుపుతిప్పింది. ఇక నా ఇన్నింగ్స్‌ను భార్య అనుష్క శర్మకు అంకితం ఇస్తున్నాను. కష్టకాలంలో ఆమె నాకిచ్చిన ప్రోత్సాహం మరువలేను" అని కోహ్లీ పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే, కేరళ వరదల్లో 324 మంది ప్రాణాలు కోల్పోయారని, 3లక్షల మందికి పైగా బాధితులు 1500కు పైగా పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారని, తమ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు విరాళాలు అందించాలని కేరళ సీఎం పినరయి విజయ్ ట్వీట్ చేశారు.
ఆయన పిలుపుతో పలువురు క్రీడా ప్రముఖులు స్పందించారు. కొందరు నేరుగా సాయం చేస్తే... మరి కొందరు కేరళ వాసులకు సాయం చేయాలని పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో 23 ఏళ్ల భారత యువ క్రికెటర్ సంజు శాంసన్ రూ.15లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే.