
పేస్ పిచ్‌లపై భారత్ ఫిర్యాదులు చేయలేదు:
ఇంగ్లండ్‌లో పర్యటించినప్పుడు భారత్ పేస్ పిచ్‌లపై ఫిర్యాదులు చేయదని, మరి స్పిన్ బౌలింగ్‌ను సరిగ్గా ఆడలేని ఇంగ్లండ్ జట్టును కాకుండా పిచ్‌ను విమర్శించడం ఏంటని స్వాన్ ప్రశ్నించాడు. ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ... 'ఇంగ్లండ్‌లో పర్యటించినప్పుడు భారత్ పేస్ పిచ్‌లపై ఎప్పుడూ ఫిర్యాదులు చేయలేదు. ఇప్పుడు అందరూ స్పిన్ పిచ్‌లపై మాట్లాడుతున్నారు. స్పిన్ బౌలింగ్‌ను సరిగ్గా ఆడలేని ఇంగ్లండ్ జట్టును కాకుండా పిచ్‌ను విమర్శించడం ఏంటి?' అని స్వాన్ మండిపడ్డాడు.

కొంటె సాకులు చెప్పొద్దు:
'డేనైట్ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లీష్ జట్టు కూడా బాగానే ఆడింది. అయితే భారత్ రెండో ఇన్నింగ్స్‌లో మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. నాలుగో టెస్టుకు కూడా ఇలాంటి పిచ్చే ఉంటుంది. అందులో ఎలాంటి సందేహమే లేదు. ఇంగ్లండ్ మరింత జాగ్రత్తగా ఆడాల్సి ఉంది. మూడో టెస్టులాగే మళ్లీ తప్పులు చేయొద్దు. పిచ్ బాగా టర్న్ అవుతుందనే కొంటె సాకులు చెప్పొద్దు. అవన్నీ పనికిమాలిన మాటలు. ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్ బౌలింగ్‌ను ఎదుర్కోవాలంటే మరింత కష్టపడాలి. అండర్సన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి విరాట్ కోహ్లీ శక్తిమేరా శ్రమించాడు' అని స్వాన్ అన్నాడు.

బ్రిటిష్ మీడియా అక్కసు:
ఇంగ్లండ్ జట్టు ఓటమికి స్పిన్ పిచ్ కారణమని, రెండు రోజుల్లోనే టెస్టు మ్యాచ్ ముగిసిందని బ్రిటిష్ వార్తా సంస్థలు కొన్ని రాసుకొచ్చాయి. భారత్ క్రీడాస్ఫూర్తి హద్దులు దాటుతుందని, ఇది అసలు టెస్టు క్రికెట్ కాదని నిందిస్తూ పేర్కొన్నాయి. స్వదేశంలో జరిగే సిరీస్‌లో ఆతిథ్య జట్టు అవకాశాలు తీసుకుంటుందని, కానీ ఈ పిచ్ అయిదు రోజులకు సరిపడేది కాదని తమ కథనాల్లో పేర్కొన్నాయి. 12-14 నెలల పాటు నరేంద్ర మోడీ (మొతేరా) స్టేడియాన్ని నిషేధించాలని వార్తలు రాసాయి.

మార్చి 4 నుంచి:
మూడో టెస్ట్ విజయంతో టీమిండియా సిరీస్‌లో ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. మొదటి టెస్ట్ ఇంగ్లండ్ గెలవగా.. రెండు, మూడు టెస్టుల్లో కోహ్లీసేన జయభేరి మోగించింది. మార్చి 4 నుంచి ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు ప్రారంభంకానుంది. భారత్ ఇది గెలిస్తే సగర్వంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.