19వ తేదీ రోజు మ్యాచ్‌లు నిర్వహించకూడదని, టీమిండియాకు అసలు కలిసి రావట్లేదని నెటింట్లో ఓ వార్త ట్రెండింగ్‌గా మారింది. భారత్ గొప్ప రికార్డులు ఆ తేదీతోనే అంతమవుతున్నాయని ఆధారాలతో సహా పోస్టులు పెడుతున్నారు. ఇవి కాస్త ఫన్నీగా ఉన్నా వాస్తవమే. అసలేం జరిగిందంటే..
డిసెంబర్ 19న భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 212 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 43 ఓవర్లలోపే ఛేదించింది. ఓపెనర్ టోనీ డి జోర్జి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ అజేయంగా 119 పరుగులు చేశాడు. అయితే ఈ ఓటమితో కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ విజయాల పరంపరకు బ్రేక్ పడింది. సారథిగా వరుసగా 10 మ్యాచ్‌ల్లో గెలిచిన రాహుల్ ఈ మ్యాచ్‌తో ఓటమి ఎదుర్కొన్నాడు.

అయితే సరిగ్గా నెల రోజుల క్రితం నవంబర్ 19న భారత్-ఆస్ట్రేలియా ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కూడా ఓపెనర్ ట్రావిస్ హెడ్ (137) శతకం చేశాడు. హెడ్ కూడా ఎడమచేతి వాటం బ్యాటరే. ఇక టీమిండియా నిర్దేశించిన 241 పరుగుల లక్ష్యాన్ని 43 ఓవర్లలోనే ఆసీస్ ఛేదించింది. అంతేగాక మెగాటోర్నీలో వరుసగా 10 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా విజయం సాధించిన రోహిత్.. ఫైనల్‌తోనే ఓటమిని చవిచూశాడు.

అనుకోకుండా 19వ తేదీనే టీమిండియా కెప్టెన్ల విజయాల రికార్డుకు బ్రేక్‌లు పడ్డాయి. ఇది యాదృచ్ఛికంగా జరిగినా రెండు మ్యాచ్‌ల్లో పోలికలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో 19వ తేదీన టీమిండియా మ్యాచ్‌లు నిర్వహించకూడదని, ఆ తేదీ మన జట్టును శనిలా వెంటాడుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కాగా, డిసెంబర్ 21న భారత్-దక్షిణాఫ్రికా మూడో వన్డే జరగనుంది. 1-1తో సిరీస్‌లో సమంగా నిలిచిన ఇరు జట్లు ఈ మ్యాచ్‌లో గెలిచి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తున్నారు.