ప్రజెంటేషన్‌తో పడేశాడు: టీమిండియా కొత్త కోచ్‌గా సెహ్వాగ్!
హైదరాబాద్: టీమిండియా తదుపరి కోచ్ ఎవరన్న ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సోమవారమే కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న వారిని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) ఇంటర్వ్యూ చేసింది. అనంతరం కొత్త కోచ్ ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ తొందర ఏమీ లేదని సీఏసీ సభ్యుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు.
ప్రధాన కోచ్ పదవి కోసం మొత్తం ఐదుగురి ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి. రవిశాస్త్రి, సెహ్వాగ్, లాల్‌చంద్ రాజ్‌పుత్ (భారత్), టామ్ మూడీ (ఆస్ట్రేలియా), రిచర్డ్ పైబస్ (దక్షిణాఫ్రికా)లు తమ శిక్షణ, ప్రణాళికల గురించి వివరించారు. వెస్టిండిస్‌కు చెందిన ఫిల్ సిమ్మన్స్ మాత్రమే ఇంటర్వ్యూకు రాలేదు.
గంగూలీతో పాటు వీవీఎస్ లక్ష్మణ్‌లు ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయానికి రాగా, లండన్‌లో ఉన్న సచిన్.. స్కైప్ ద్వారా ఇంటర్వ్యూ ప్రక్రియలో పాల్గొన్నాడు. అభ్యర్థుల ప్రజెంటేషన్ విషయంలో గతేడాది మాదిరే సాగిందని గంగూలీ చెప్పారు. కోచ్‌గా రవిశాస్త్రిని ఎంపిక చేయడం లాంఛనమే అనుకున్న సమయంలో గంగూలీ ఓ ట్విస్ట్ ఇచ్చాడు.

రవిశాస్త్రి కంటే సెహ్వాగ్‌వైపే మొగ్గు
అదేంటంటే ఇంటర్వ్యూలు పూర్తి అయిన తర్వాత టీమిండియా కెప్టెన్ కోహ్లీతో మాట్లాడి కోత్త కోచ్ పేరుని ప్రకటిస్తామని చెప్పాడు. నిజానికి శాస్త్రినే కోచ్‌గా చేయాలనుకుంటే కెప్టెన్ కోహ్లితో మాట్లాడాల్సిన అవసరం లేదు కదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీఏసీ రవిశాస్త్రి కంటే సెహ్వాగ్‌వైపే మొగ్గు చూపుతున్నట్లు తాజాగా మరో సమాచారం. బీసీసీఐలోని ఒక వర్గం చెబుతున్న ప్రకారం కోహ్లీ ముందు సీఏసీ రెండు ప్రత్యామ్నాయాలు ఉంచి అందులో ఒకరిని ఎంపిక చేసుకోమని కోరినట్లు సమాచారం. అయితే అందులో శాస్త్రి పేరు కాకుండా సెహ్వాగ్, టామ్ మూడీ పేర్లు ఉన్నాయని అంటున్నారు.

సెహ్వాగ్ ఇంటర్వ్యూ రెండు గంటలకు పైగా
ప్రధాన కోచ్ పదవి కోసం సెహ్వాగ్ ఇంటర్వ్యూ రెండు గంటలకు పైగా సాగింది. ఈ ఇంటర్వ్యూల్లో ఇండియన్ క్రికెట్ భవిష్యత్తుపై సెహ్వాగ్ విజన్ సీఏసీలోని ముగ్గురు దిగ్గజాలను ఆకట్టుకున్నట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. దీంతో సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌లతో కూడిన (సీఏసీ) సెహ్వాగ్‌నే కోచ్‌గా చేయాలని దాదాపు నిర్ణయానికి వచ్చేసింది. ఇదే విషయాన్ని కెప్టెన్ కోహ్లీకి వివరంగా చెప్పాలని సీఏసీ భావిస్తోందని, ఈ నేపథ్యంలోనే కోహ్లీతో మాట్లాడాకే కొత్త కోచ్ ప్రకటన ఉంటుందని గంగూలీ చెప్పాడని సమాచారం. ఇదే విషయాన్ని బోర్డులోని ఓ సీనియర్ అధికారి సైతం ధ్రువీకరించారు.

కోహ్లీకి పరోక్షంగా చెప్పినట్లే
కోచ్‌లు ఎలా పని చేస్తారన్నది కోహ్లీ అర్థం చేసుకోవాలని గంగూలీ చెప్పడాన్ని చూస్తే నువ్వు కోరుకున్న వ్యక్తిని ఇవ్వడం కుదరదు అని పరోక్షంగా కోహ్లీకి చెప్పినట్లనని అంటున్నారు. దీంతో పాటు కొత్త కోచ్ విజన్‌పై కోహ్లీకి వివరించాలని కూడా సీఏసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 'ప్రతి కోచ్‌కు ఒక శైలి ఉంటుంది. ప్రతి ప్రొఫెషనల్ ఓ శైలి కలిగి ఉంటాడు. సంబంధించిన అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకునేలా చేయడం కోసమే సీఏసీ వాయిదా నిర్ణయం తీసుకుంది' అని అమితాబ్ చౌదరి వివరించాడు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న కోహ్లీ జులై 17న భారత్‌కు తిరిగ వచ్చే అవకాశం ఉంది.

కోచ్ పదవి రవిశాస్త్రికి కష్టమే
ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తుంటే రవిశాస్త్రికి కోచ్ పదవి కష్టమేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇదే గనుక నిజమైతే తనకు అస్సలు నచ్చని రవిశాస్త్రిని మరోసారి తప్పించడంలో గంగూలీ విజయవంతం అయినట్లే కనిపిస్తోంది. మరోవైపు కోచ్ పేరును నేరుగా ప్రకటించకుండా కోహ్లీని అందులో భాగస్వామిని చేయడం అనేది సీఏసీ తెలివిగా వ్యవహరించిన నిర్ణయమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

మంగళవారం సాయంత్రం లోపు కొత్త కోచ్ ఎవరో ప్రకటించండి
ఇదిలా ఉంటే టీమిండియా తదుపరి కోచ్ ఎవరో మంగళవారం సాయంత్రం లోపు ప్రకటించాలని సీఏసీని బీసీసీఐ పరిపాలనా కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్ ఆదేశించినట్లు సమాచారం. కోచ్‌లు ఎలా పని చేస్తారన్నది కోహ్లీ అర్థం చేసుకోవాలి కాబట్టి వెస్టిండీస్ నుంచి తిరిగొచ్చాక అతడితో మేం ఈ విషయమై మాట్లాడి కొత్త కోచ్‌ని ప్రకటిస్తామని చెప్పడంతో బీసీసీఐ పాలకుల కమిటీ ఛైర్మన్ వినోద్‌రాయ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం లోగా కొత్త కోచ్ పేరుని ప్రకటించాలని బీసీసీఐని ఆయన ఆదేశించినట్లు సమాచారం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications