హైదరాబాద్: టీమిండియా తదుపరి ప్రధాన కోచ్ ఎవరన్న దానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులను క్రికెట్ సలహా కమిటీ(సీఏసీ) సభ్యులు లక్ష్మణ్, గంగూలీ ముంబైలోని ప్రధాన కార్యాలయంలో సోమవారం ఇంటర్యూలు నిర్వహించారు.
మొత్తం ఆరుగురు సీనియర్ క్రికెటర్లను సీఏసీ ఇంటర్వ్యూ చేసినట్టు తెలుస్తోంది. టీమిండియా ప్రధాన కోచ్ పదవికి రవిశాస్త్రి రేసులో ముందు ఉన్నప్పటికీ కొత్త కొచ్‌గా సీఏసీ ఎవరినీ ఎంపిక చేయలేదు. ఇంటర్యూ అనంతరం క్రికెట్ సలహా కమిటీ(సీఏసీ)లో సభ్యుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ మీడియాతో మాట్లాడాడు.

టీమిండియా ప్రధాన కోచ్ పదవికి తొందర ఏమీ లేదని అన్నాడు. కొత్త కోచ్ ఎంపికకు మరింత సమయం అవసరమని తెలిపాడు. అందరి అభిప్రాయం తీసుకున్నాకే కొత్త కోచ్ ఎంపిక ఉంటుందని స్పష్టం చేశాడు. ప్రస్తుతానికి కోచ్ లేకుండానే టీమిండియా కొనసాగుతుందని స్పష్టం చేశాడు.
ప్రధాన కోచ్ పదవి రేసులో ముందున్నట్టు భావిస్తున్న రవిశాస్త్రకి కెప్టెన్ కోహ్లీ మద్దతు ఉందని, ఆయననే కోచ్‌గా నియమించాలంటూ కోహ్లీ కోరుతున్నట్టు వచ్చిన కథనాలను గంగూలీ తోసిపుచ్చారు. కోచ్ ఎంపికకు కోహ్లీ పూర్తిగా దూరంగా ఉన్నారని, ఈ విషయంలో ఎలాంటి సూచనలు, సలహాలు ఇవ్వలేదని గంగూలీ తెలిపాడు.
అంతేకాదు కోచ్ పదవికి ఎవరి పేరును కోహ్లీ సూచించలేదని కూడా గంగూలీ స్పష్టం చేశారు. అదే సమయంలో కోచ్ ఎలా పనిచేస్తారనేది కోహ్లీ అర్థం చేసుకోవాల్సి ఉందని గంగూలీ అన్నాడు. అందుకే కోచ్‌ను ఖరారు చేయడంలో కోహ్లీతో మాట్లాడాలనుకుంటున్నామని, ప్రస్తుతం కోహ్లి అమెరికాలో ఉన్నాడని చెప్పాడు.