శ్రీలంక పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. సూర్య సారథ్యంలో టీ20లకు, రోహిత్ కెప్టెన్సీలో వన్డే జట్టును వెల్లడించింది. జులై 27 నుంచి లంకతో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. అయితే తన సరికొత్త కెరీర్‌ను అదిరేలా ఆరంభించాలని భావించి.. భారత జట్టు ఎంపికలో ప్రధాన పాత్ర వహించిన నయా కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వస్తున్నాయి.
గంభీర్ ఫేవరిటిజం చూపిస్తూ కొందరికి సువర్ణావకాశాలు ఇస్తూ, మరికొందరిపై వేటు వేశాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిలకడగా పరుగులు సాధిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ జట్టులో ఎందుకు చోటు కోల్పోయాడని ప్రశ్నలు వస్తున్నాయి. మరోవైపు వన్డేల్లో కేకేఆర్ పేసర్ హర్షిత్ రాణా చోటు దక్కించుకోవడంపై కూడా నెట్టింట్లో పోస్టులు వెల్లువెత్తున్నాయి. కోచ్‌గా బాధ్యతలు చేపట్టకముందు గంభీర్ కేకేఆర్‌కు మెంటార్‌గా బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే.

రోహిత్ శర్మతో పాటు టీ20లకు విరాట్ కోహ్లి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఓపెనర్‌గా రోహిత్ స్థానాన్ని భర్తీ చేయడానికి యువ ఆటగాళ్లు ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు. కానీ వన్‌డౌన్‌లో వచ్చే కోహ్లిలా సందర్భాన్ని బట్టి గేర్‌లు మార్చుతూ ఇన్నింగ్స్‌కు ఇరుసులా మారే బ్యాటర్ దొరకడం అంత తేలిక కాదు. కానీ రుతురాజ్ కోహ్లికి వారసుడిలా జింబాబ్వే పర్యటనలో సత్తాచాటాడు. అజేయంగా 77 పరుగులు, మరో ఇన్నింగ్స్‌లో 49 పరుగులతో రాణించాడు.
అంతేగాక గత ఏడు టీ20 ఇన్నింగ్స్‌ల్లో రుతురాజ్ 71 సగటుతో, 158 స్ట్రైక్‌రేటుతో పరుగులు చేశాడు. కానీ శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్‌కు రుతురాజ్ ఎంపిక కాకపోవడం గమనార్హం. బ్యాకప్ ఓపెనర్‌గా కూడా రుతురాజ్‌ను సెలక్ట్ చేయలేదు. మరోవైపు కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వన్డే జట్టులోకి తిరిగొచ్చాడు. అంతేగాక బీసీసీఐ అతనికి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇస్తుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నిర్ణయాలన్నింటికీ గంభీర్ ప్రధాన కారణమని ప్రచారం సాగుతోంది.
ఈ నేపథ్యంలో సీఎస్కే ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్‌పై గంభీర్ ద్వేషం చూపించాడని, కేకేఆర్ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, హర్షిత్ రాణాలపై ప్రేమ చూపించాడని కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు సీఎస్కే ఆల్‌రౌండర్ శివమ్ దూబె వన్డే, టీ20 జట్టులో చోటు సంపాదించాడని, సీఎస్కేపై గంభీర్‌కు ఎలాంటి ద్వేషం లేదని మరికొందరు నెటిజన్ల కౌంటర్ ఇస్తున్నారు. కాగా, రుతురాజ్‌పై వేటు వేయడంపై క్రికెట్ నిపుణులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
టీమిండియా టీ20 జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషభ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్
టీమిండియా వన్డే జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబె, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.