
ఈ నెల 26 నుంచి సపారీ గడ్డపై భారత్, సౌతాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఒమిక్రాన్ భయపెడుతోంది. కరోనా రూపాలలో ఒకటి అయినా ఒమిక్రాన్ ప్రస్తుతం సౌతాఫ్రికాలో విజృంభిస్తోంది. ఇప్పటికే అక్కడ భారీగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒక వేళ సౌతాఫ్రికాలో ఒమిక్రాన్ కేసులు మరింతగా విజృంభించి, పరిస్థితులు చేయిదాటి పోతే లాక్‌డౌన్ పెట్టి దేశ సరిహద్దులు మూసి వేయాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితులు ఏర్పడితే టీమిండియా వెంటనే స్వదేశానికి తిరిగి వచ్చేందుకు సౌతాఫ్రికా ప్రభుత్వం అనుమతిస్తుందని బీసీసీఐకి సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు హామీ ఇచ్చింది. ఇప్పటికే కరోనా నాల్గో వేవ్‌లో భాగంగా దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ విజృంభిస్తుండడంతో తొలి టెస్టు మ్యాచ్ ప్రేక్షకులు లేకుండానే జరగనుంది. అంతేకాకుండా దక్షిణాఫ్రికాలో స్థానికంగా జరగాల్సిన లీగ్‌లను కూడా సీఎస్ఏ వాయిదా వేసింది.
ఏదేని కారణం వల్ల టీమిండియా సౌతాఫ్రికా నుంచి స్వదేశానికి వెళ్లాలనుకుంటే అప్పటికప్పుడు వెళ్లిపోవచ్చని సీఎస్ఏ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షుయబ్ మంజ్రా తెలిపారు. ఒక వేళ ఆ సమయంలో సరిహద్దులు మూసి ఉన్నప్పటికీ టీమిండియాను సురక్షితంగా స్వదేశానికి పంపడానికి కావాల్సిన అనుమతులను ఇప్పటికే సౌతాఫ్రికా ప్రభుత్వం నుంచి తీసుకున్నామని ఆయన చెప్పారు. అంతేకాకుండా ప్రస్తుతం సౌతాఫ్రికాలో భారత జట్టు సురక్షితంగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. భారత జట్టు కోసమే ఒక హోటల్‌ను బుక్ చేశామని, టీమిండియాకు ప్రతిరోజు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. హోటల్‌లోకి బయటి నుంచి ఎలాంటి ఆహార పదార్థాలను అనుమతించడం లేదని ఆయన తెలిపారు. అలాగే ప్రస్తుతం టీమిండియా సురక్షితంగా ఉందని మంజ్రా చెప్పారు. అంతేకాకుండా భారత జట్టులోని వారు ఎవరికైనా వైరస్ సోకితే వారిని వెంటనే ఆసుపత్రుల్లో చేర్చాడానికి పడకలు కూడా తీసుకున్నామని ఆయన తెలిపారు. సిరీస్ సజావుడా సాగడానికి సీఎస్ఏ అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. అంతేకాకుండా బీసీసీఐ, సీఎస్ఏ అధికారులు ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నారని సీఎస్ఏ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షుయబ్ మంజ్రా తెలిపారు.
కాగా ఒమిక్రాన్ కారణంగా ఇప్పటికే టెస్ట్ సిరీస్ ఆలస్యంగా ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఇండియా, సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ ఈ నెల 17 నుంచే జరగాల్సి ఉంది. అంతేకాకుండా ఒమిక్రాన్ భయంతో షెడ్యూల్‌లోని టీ20 సిరీస్‌ను కూడా వాయిదా వేశారు. అంతేకాకుండా నెదర్లాండ్ జట్టుతో సౌతాఫ్రికా ఆడాల్సిన వన్డే సిరీస్‌ను కూడా సీఎస్ఏ వాయిదా వేసింది. టెస్ట్ సిరీస్ మాత్రం ఈ నెల 26 నుంచి జరగనుంది. ఆ తర్వాత ఇరుజట్లు మూడు వన్డేల సిరీస్‌లో కూడా తలపడనున్నాయి.