ధోనిని తక్కువ చేయొద్దు: 'అతడి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు లేడు'
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అనుభవాలను తక్కువగా చేసి చూడొద్దని ఆస్ట్రేలియా దిగ్గజం అడమ్ గిల్‌క్రిస్ట్ అన్నారు. ఢిల్లీలో 'రాయల్ స్టాగ్ బారెల్ పర్ఫెక్ట్ స్ట్రోక్స్' కార్యక్రమానికి హాజరైన గిల్ క్రిస్ట్ ధోని, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలపై ప్రశంసల వర్షం కురిపించారు.
ముఖ్యంగా ధోని అనుభవాలను తక్కువగా చేసి చూడొద్దని సూచించారు. అతని వల్ల భారత జట్టుకు ఎంతో మేలు జరిగిందని గిల్ క్రిస్ట్ అభిప్రాయపడ్డారు. 'ధోని జట్టులో ఉండడం భారత్‌కు గొప్ప సానుకూలాంశం. అతడి అనుభవం ద్వారా భారత్ తాను అనుకుంటున్నదాని కంటే ఎక్కువే ప్రయోజనం పొందుతోంది. అక్కడున్న వాళ్లు ధోనిని తక్కువ చేసి మాట్లాడటం నాకెంతో ఆశ్చర్యం కలిగిస్తోంది' అని గిల్‌క్రిస్ట్ అన్నాడు.

మూడో నెంబర్ నుంచి ఏడో నంబర్ వరకు
ధోనీ బహుముఖ ఆటగాడని, ఇప్పటికీ మూడో నెంబర్ నుంచి ఏడో నంబర్ వరకు ఏ స్ధానంలోనైనా అద్భుతంగా రాణించగలిగిన గొప్ప బ్యాట్స్‌మెన్ అని కొనియాడారు. 'గత 12 నెలల్లో అతడి గణాంకాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. కానీ బాధ్యత అప్పజెప్పినప్పుడు ఎప్పుడూ అతడు జట్టును నిరాశపరచలేదు' అని గిల్ క్రిస్ట్ చెప్పుకొచ్చాడు.

ధోని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు లేడు
భారత జట్టులో అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు లేడని అభిప్రాయపడ్డారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ, ఇతర జట్టు ఆటగాళ్లలో ఉన్న కసి, క్రీడాస్ఫూర్తి తనకెంతో ఇష్టమని అన్నాడు. జట్టులో సమతుల్యంగా నడిపించే తెలివైన కెప్టెన్ ఉండటం ఎంతో గొప్ప విషయమని గిల్ క్రిస్ట్ అన్నాడు.

2019 వరల్డ్ కప్ బరిలో ఉండాలో, లేదో ధోనీకి తెలుసు
2019 వరల్డ్ కప్ పోటీలకు ఇంకా కొంత సమయం ఉన్న నేపథ్యంలో ధోని స్థానాన్ని భర్తీ చేసేవారు తనకు కనబడలేదని గిల్ క్రిస్ట్ పేర్కొన్నాడు. 2019 వరల్డ్ కప్ బరిలో ఉండాలో, లేదో ధోనీకి తెలుసునని ఈ సందర్భంగా గిల్ క్రిస్ట్ వ్యాఖ్యానించాడు. వరల్డ్ కప్‌కి ఇంకా 18 నెలల సమయం ఉన్నందున ఈలోగా ఏమైనా జరగొచ్చని అన్నాడు.

ఇప్పటికే 49 సెంచరీలు చేసిన కోహ్లీ
ఇక, విరాట్ కోహ్లీ ఇప్పటికే 49 సెంచరీలు సాధించాడని, కోహ్లీ దూకుడు వల్ల అందరి బ్యాటింగ్ రికార్డులు ప్రమాదంలో పడే అవకాశం ఉందని గిల్ క్రిస్ట్ అన్నాడు. 'అన్ని ఫార్మాట్లలోని బ్యాటింగ్ గణాంకాలు ప్రమాదంలో పడతాయి. ఇదో అద్భుతమైన అంశం. కోహ్లీ అద్భుతమైన ఆటగాడు. ఒకవేళ కోహ్లీ అన్ని బ్యాటింగ్ రికార్డులను అధిగమించకపోయినా, వాటికి దగ్గరిగా మాత్రం వెళ్తాడని అనుకుంటున్నా' అని గిల్‌క్రిస్ట్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications