వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ముందు భారత జట్టు మరో అడుగు ముందుకేసింది. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియాను వెనక్కు నెట్టి అగ్రస్థానం కైవసం చేసుకుంది. వార్షిక అప్‌డేట్‌లో భాగంగా 2019-2020 సీజన్‌లో ఫలితాలను ఐసీసీ పక్కన పెట్టేసింది. మే 2020 నుంచి ఆడిన మ్యాచుల ఫలితాల ఆధారంగా కొత్త ర్యాంకులను ప్రకటించింది.
ఈ కొత్త లెక్కల్లో భారత్ సాధించిన రేటింగ్ పాయింట్ల సంఖ్య 119 నుంచి 121కి పెరిగింది. 2020 మార్చిలో న్యూజిల్యాండ్ చేతిలో 2-0 తేడాతో భారత్ టెస్టు సిరీస్ ఓడింది. అయితే కొత్త లెక్కల్లో ఈ ఫలితం చేరలేదు. దీంతో భారత్ సాధించిన రేటింగ్ పాయింట్ల సంఖ్య పెరిగింది. కొత్త గణాంకాల్లో 2020 మే ముందు ఆడిన మ్యాచుల ఫలితాల ద్వారా పాయింట్లలో 50 శాతాన్ని మాత్రమే లెక్కల్లోకి తీసుకుంటారు.

దీంతో భారత్ రేటింగ్ పాయింట్లు పెరిగాయి. భారత జట్టు చివరగా 2021 డిసెంబరులో టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పుడు ఆసీస్‌ను వెనక్కు నెట్టి తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుత గణాంకాల్లో ఆస్ట్రేలియా రేటింగ్ పాయింట్ల సంఖ్య 122 నుంచి 116కు పడిపోయాయి.
2019-20లో పాకిస్తాన్, న్యూజిల్యాండ్‌లపై స్వదేశంలో టెస్టు సిరీసులు క్లీన్ స్వీప్ చేసిన పాయింట్లు ఆస్ట్రేలియా కోల్పోయింది. అలాగే ఇంగ్లండ్‌పై 4-0తో గెలిచిన సిరీస్ పాయింట్లు కూడా 50 శాతమే చేరాయి. దీంతో ఆసీస్ రేటింగ్ పాయింట్లు తగ్గాయి. అన్ని ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ పగ్గాలు అందుకున్న తర్వాత.. టెస్టుల్లో నెంబర్ వన్ పొజిషన్ దక్కడం ఇదే తొలిసారి.
అంతేకాదు, భారత్ ఇప్పటికే టీ20ల్లో నెంబర్ వన్ జట్టుగా కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో హార్దిక్ పాండ్యా నాయకత్వంలో పొట్టి ఫార్మాట్‌లో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శనలు చేసిన సంగతి తెలిసిందే. ఇక వన్డేల్లో ప్రస్తుతం భారత జట్టు మూడో స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత్ ఎక్కువగా వన్డేలు ఆడనున్న క్రమంలో.. ఈ ర్యాంకు కూడా మారే అవకాశం ఉంది.