
పుజారా, రహానే శ్రమిస్తున్నారు..
ఇక నాలుగో రోజు ఆట అనంతరం విక్రమ్ రాథోడ్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా రహానే, పుజారా ఫామ్‌పై ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'పుజారా, రహానె మళ్లీ గాడిలో పడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారు 100 శాతం కష్టపడుతున్నారు. రహానే తిరిగి లయ అందుకున్నాడు. కానీ, దురదృష్టవశాత్తు రెండో ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకు ఔటయ్యాడు. పుజారా కూడా రాణించలేదు.
అతను గతంలో పలు కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. కానీ, సౌతాఫ్రికా పిచ్‌లు బ్యాట్స్‌మెన్‌కు సవాళ్లు విసురుతాయి. ఇక్కడ ఎక్కువ మంది పరుగులు చేయలేదు. వాళ్లిద్దరూ శక్తిమేరకు ప్రయత్నిస్తున్నంత కాలం ఓపికతో ఉండాలి. వాళ్లకు అత్యుత్తమ కోచింగ్ ఇవ్వడానికి మేం కట్టుబడి ఉన్నాం. ఈ విషయంలో మేమెంతో ఓపికతో ఉన్నాం' అని విక్రమ్ చెప్పుకొచ్చాడు.

సరైన బంతిని..
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు ఇన్నింగ్స్‌ల్లో ఒకే తరహాలో ఔటవ్వడంపై స్పందిస్తూ.. భారత కెప్టెన్ తన షాట్ సెలెక్షన్ మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్‌కు ఔటవ్వుతున్నానని షాట్ ఆడకుండా ఉండాల్సిన అవసరం లేదని, కాకపోతే మెరుగైన బంతిని ఎంచుకోవాలని కోహ్లీకి సూచించాడు. 'ఈ తరహా షాట్స్ కోహ్లీ మరిన్ని పరుగులు చేసేలా చేస్తాయి.
అతను ఆ షాట్ ఆడాల్సిన అవసరం ఉంది. అయితే కొన్నిసార్లు మనకు బలంగా ఉన్న విషయాలే బలహీనంగా మారుతాయి. ఆ షాట్స్ ఆడకపోతే ఔటవ్వకుండా ఉండవచ్చు. అదే విధంగా పరుగులు కూడా రావు. కాబట్టి షాట్ ఆడాల్సిన అవసరం ఉంది. కోహ్లీ ఆడిన షాట్ సరైందే కానీ.. అతను సరైన బంతిని ఎంచుకోవాల్సింది.'అని విక్రమ్ రాథోడ్ అభిప్రాయపడ్డాడు.

రెండు ఇన్నింగ్స్‌ల్లో ఒకే తరహాలో..
ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 35 పరుగులకు ఔటైన కోహ్లీ.. రెండో ఇన్నింగ్స్‌లో 18 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో వికెట్ల దూరంగా వెళ్తున్న బంతిని గెలికి మరీ వికెట్ సమర్పించుకున్నాడు.
వరుస బంతుల డాట్ అవ్వడంతో సహనం కోల్పోయిన విరాట్.. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతిని వెంటాడి మరి ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో లుంగి ఎంగిడి బౌలింగ్‌లో ఫస్ట్ స్లిప్‌లోకి క్యాచ్ ఇచ్చిన విరాట్.. రెండో ఇన్నింగ్స్‌లో మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో అలానే వెంటాడి కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు.

విజయానికి చేరువగా..
ఈ మ్యాచ్‌లో భారత్ విజయం దిశగా దూసుకెళ్తుంది. మరో ఐదు వికెట్లు తీస్తే తొలి టెస్ట్‌ను తమ ఖాతాలో వేసుకుంటుంది. 94/4 ఓవర్ నైట్ స్కోర్ చివరి రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా 54 ఓవర్లలో 5 వికెట్లకు 138 రన్స్ చేసింది. క్రీజులో క్వింటన్ డికాక్(2 బ్యాటింగ్), టెంబా బవుమా(11 బ్యాటింగ్) ఉన్నారు. హాఫ్ సెంచరీ భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచిన కెప్టెన్ డీన్ ఎల్గర్(77)ను బుమ్రా పెవిలియన్ చేర్చాడు.
ఇక తొలి ఇన్నింగ్స్ భారత్ 327 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా 197 పరుగులకే కుప్పకూలింది. దాంతో టీమిండియా 130 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో 174 రన్స్ మాత్రమే చేసిన కోహ్లీసేన.. ప్రత్యర్థి ముందు 305 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. సౌతాఫ్రికా విజయానికి ఇంకా 167 పరుగులు చేయాలి.