ముంబై: భారత హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే పెట్టిన పరీక్షలో విరాట్ కోహ్లీ సహా టీమిండియా బ్యాట్సుమెన్ అందరూ ఫెయిల్ అయ్యారు. అజింక్యా రహానే ఒక్కడే పాస్ అయ్యాడు. బ్యాట్స్‌మెన్‌కు కుంబ్లే గంట పాటు పరీక్ష పెట్టాడు.
ఇటీవల వన్డే, ట్వంటీ 20, టెస్టుల్లో బాగా రాణిస్తున్న కోహ్లీ కూడా కుంబ్లే పరీక్షలో ఫెయిల్ కావడం గమనార్హం. ప్రాక్టీస్ సెషన్‌లో టెస్ట్ మ్యాచులో కట్టుకునే ప్యాడ్లతో బరిలోకి దిగమని కుంబ్లే వారికి చెప్పాడు. అంతేకాదు, గంటపాటు ఔట్ కాకుండా బంతులను ఎదుర్కోవాలని సూచించాడు. ఈ గంట పాటు కూడా కోహ్లీ క్రీజులో నిలబడలేకపోయాడు.

వెస్టిండీస్ పర్యటనకు ముందు ఆదివారం నాడు టీమిండియా ప్రాక్టీస్ సెషన్ మొదలు పెట్టింది. తొలిరోజు యోగాసనాలు వేయించిన కుంబ్లే.. రెండోరోజు ఆటగాళ్లను బెంగళూరుకు 40 కిలోమీటర్ల దూరంలోని ఆలూరుకు తీసుకు వెళ్లాడు.
అక్కడ టెస్ట్ మ్యాచ్ ప్యాడ్లు ఇచ్చి, గంటపాటు ఔట్ కాకుండా బ్యాటింగ్ చేయమని పోటీ పెట్టాడు. అలాగే, వీలైనన్ని వికెట్లు పడగొట్టాలని బౌలర్లకు చెప్పాడు. ఈ క్రమంలో గంట వ్యవధిలో కోహ్లీ రెండుసార్లు అవుటయ్యాడు. జడెజా స్పిన్ బౌలింగుకు అతను బోల్తా పడ్డాడు. శిఖర్ ధావన్, మురళీ విజయ్‌లు కూడా గంట పాటు నిలబడలేకపోయారు. ఒక్క రహానే మాత్రం నెగ్గాడు.