
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. అతని అకౌంట్ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు 2 గంటల వ్యవధిలో 9 ట్వీట్లు చేశారు. అంతేకాకుండా బిట్ కాయిన్ల కోసం కృనాల్ ట్విట్టర్ అకౌంట్‌ను అమ్మేయనున్నట్లు ఆ ట్వీట్లలో ఉంది. ఈ అమ్మకంపై ఓ నెటిజన్ స్పందించగా.. అతడి క్రిప్టోకరెన్సీ పంపాల్సిందిగా సదరు హ్యాకర్ కోరాడు. ట్విట్టర్ అకౌంట్ అమ్మకంతోనే హ్యాకర్లు ఆగిపోలేదు. కృనాల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి బుధవారం భారత జట్టుకు ఎంపికైన దీపక్ హుడాపై అసభ్యకరమైన ట్వీట్లు కూడా చేశారు. కాగా గతంలో ఓ దేశవాళీ మ్యాచ్ సందర్భంగా కృనాల్ పాండ్యా, దీపక్ హుడా మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో దీపక్ హుడాపై ఏడాది పాటు నిషేధం కూడా విధించారు.
కాగా బుధవారం ప్రకటించిన భారత జట్టులో కృనాల్ పాండ్యా, హార్ధిక్ పాండ్యా ఇద్దరికీ చోటు దక్కలేదు. అదే సమయంలో దీపక్ హుడా ఎంపికయ్యాడు. దీంతో ఇది మనసులో పెట్టుకుని దీపక్ హుడాపై కృనాల్ పాండ్యా అసభ్యకర కామెంట్స్ చేస్తున్నట్టుగా హ్యాకర్లు ట్వీట్ చేస్తున్నారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కృనాల్ పాండ్యా మద్యం సేవించి ట్వీట్లు చేస్తున్నాడని కొందరు అంటే, అతని ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని మరికొందరు అంటున్నారు. కాగా ఈ విషయాన్ని గుర్తించిన కృనాల్ పాండ్యా తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశాడు.కాగా క్రికెటర్ల సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ కావడం ఇది కొత్తేం కాదు. 2019లో ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్, 2021లో టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు కూడా హ్యాక్ అయ్యాయి. దీంతో ఆ సమయంలో వారు తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ల నుంచి వచ్చే సందేశాలను ఎవరూ నమ్మవద్దని అభిమానులను కోరారు.
అంతర్జాతీయ క్రికెట్లో కృనాల్ పాండ్యా ఇప్పటివరకు 5 వన్డే మ్యాచ్‌లు, 19 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 130, టీ20ల్లో 124 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 58 కాగా.. మొత్తంగా 17 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 4/36. ఇక ఐపీఎల్‌లో 84 మ్యాచ్‌లు ఆడాడు. 22 సగటుతో 1143 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోర్ 86 పరుగులు. అదే సమయంలో 51 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 3/14.