
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రంజీ ట్రోఫీ ఆడడం లేదు. ఈ మేరకు రంజీ ట్రోఫీ నుంచి తప్పుకుంటున్నట్లు పాండ్యా అధికారికంగా ప్రకటించాడు. రానున్న ఐపీఎల్ 2022 నేపథ్యంలోనే పాండ్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లో రాణించి టీమిండియా పరిమిత ఓవర్ల జట్టులోకి మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలని పాండ్యా ఆశిస్తున్నాడని సమాచారం. ప్రస్తుత రంజీ ట్రోఫీ ఈ నెల 10 నుంచి ప్రారంభం కానుంది. రెండు దశల్లో జరగనున్న ఈ ట్రోఫీల్లో తొలి దశ ఈ నెల 10 నుంచి మార్చి 15 వరకు పలు వేదికట్లో జరగనుంది.
రెండో దశ ఐపీఎల్ ముగిసిన అనంతరం మే 30 నుంచి జూన్ 26 వరకు నిర్వహించనున్నారు. కాగా ఈ రంజీ ట్రోఫీలో హార్దిక్ పాండ్యా బరోడా జట్టుకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. అంతేకాకుండా ఆ జట్టుకు పాండ్యా కెప్టెన్‌గా కూడా వ్యవహరించాల్సి ఉంది. కానీ హార్ధిక్ పాండ్యా తప్పుకోవడంతో కెప్టెన్సీ బాధ్యతలను బరోడా జట్టు కేదార్ దేవ్‌ధర్‌కు అప్పగించింది. విష్ణు సోలం వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. 20 మందితో కూడిన బరోడా జట్టు నుంచి హార్దిక్ పాండ్యా తప్పుకున్నప్పటికీ అతని సోదరుడు కృనాల్ పాండ్యా బరిలోకి దిగనున్నాడు.
గతేడాది టీ20 వరల్డ్‌కప్ తర్వాత హార్దిక్ పాండ్యా మళ్లీ భారత జట్టు తరఫున ఆడలేదు. సౌతాఫ్రికా పర్యటన నుంచి ఫిట్‌నెస్ సమస్యలతో తనకు తానుగానే తప్పుకున్నాడు. వెస్టిండీస్‌తో స్వదేశంలో జరుగుతున్న సిరీస్‌లో ఆడాలని భావించినప్పటికీ సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. ఈ విషయమై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ రంజీ ట్రోఫీలో ఆడి హార్దిక్ పాండ్యా తన ఫిట్‌నెస్ నిరూపించుకోవాలని సూచించాడు. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్ చేయాలని చెప్పాడు. కాగా వెన్నునొప్పి కారణంగా గత ఐపీఎల్ సీజన్ నుంచి హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయని సంగతి తెలిసిందే.
కాగా రానున్న ఐపీఎల్ సీజన్ కోసం ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాను సీవీసీ క్యాపిటల్స్‌కు చెందిన కొత్త జట్టు అహ్మదాబాద్ రిటైన్ చేసుకుంది. అంతేకాకుండా ఈ సీజన్‌కు తమ కెప్టెన్ హార్దిక్ పాండ్యానే అని వెల్లడించింది. ఇందుకుగాను పాండ్యాకు అహ్మదాబాద్ మేనేజ్‌మెంట్ 15 కోట్ల రూపాయలు చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకుంది.
బరోడా జట్టు
కేదార్ దేవ్‌ధర్ (కెప్టెన్), విష్ణు సోలంకి (వైస్ కెప్టెన్), ప్రత్యూష్ కుమార్, శివాలిక్ శర్మ, కృనాల్ పాండ్యా, అభిమన్యుసింగ్ రాజ్‌పుత్, ధ్రువ్ పటేల్, మితేష్ పటేల్, లుక్మాన్ మేరీవాలా, బాబాసఫిఖాన్ పఠాన్ (వికెట్ కీపర్), అతిత్ షేత్, భార్గవ్ భట్, పార్త్ కోహ్లీ, శాశ్వత్ రావత్, శశ్వత్ రావత్ , గుర్జీందర్‌సింగ్ మన్, జ్యోత్స్నిల్ సింగ్, నినాద్ రథ్వా, అక్షయ్ మోర్.