హైదరాబాద్: సెప్టెంబర్ 5... ఈరోజుని తమ జీవితంలో ఎవరూ మరిచిపోలేరు. ఎందుకంటే టీచర్స్ డే కాబట్టి. టీచర్స్ డేని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ తమ గురువుల నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ విషయానికి వస్తే ఈరోజంటే సచిన్‌కి ఎంతో ప్రత్యేకం.
ఉదయాన్నే తన గురువు రమాకాంత్ ఆచ్రేకర్‌కి శుభాకాంక్షలు తెలిపాడు. అనంతరం వాంఖడే మైదానంలో ఆచ్రేకర్ తనపై కేకలు వేసిన సందర్భాన్ని గుర్తు చేసుకోవడంతో పాటు ఆయన ఆనాడు చెప్పిన పాఠం వల్లే తాను ఈ రోజు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నట్లు సచిన్ తెలిపాడు. ఆ సందర్భాన్ని వివరిస్తూ తన ట్విట్టర్‌లో ఓ వీడియోను సచిన్ అభిమానులతో పంచుకున్నాడు.
టీచర్స్ డే సందర్భంగా పీవీ సింధు తన కోచ్ గోపీచంద్‌కు గురుదక్షిణగా ఓ డిజిటల్ ఫిల్మ్‌ను నిర్మించింది. ఈ డిజిటల్ ఫిల్మ్‌లో సింధునే స్వయంగా నటించింది. గోపీ శిక్షణలో తానెలా రాటుదేలిందన్న అంశాన్ని ఇతి వృత్తంగా తీసుకొని ఈ డిజిటల్ ఫిల్మ్‌ను రూపొందించింది. '#IHATEMYTEACHER' పేరుతో ఉన్న ఈ డిజిటల్ ఫిల్మ్‌లో గోపీచంద్‌తో తన ప్రయాణం ఎలా సాగిందో క్లుప్తంగా వివరించింది.
టీచర్స్ డే రోజున టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా తనదైన శైలిలో స్పందించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో పలు రికార్డులు సృష్టించిన మాజీ క్రికెటర్లు తనకు గురువులంటూ తన పేస్‌బుక్ పేజిలో ఓ పోస్టు పెట్టాడు.
శ్రీలంక పర్యటనలో భాగంగా ఐదు వన్డేల సిరిస్‌లో అద్భుత ప్రదర్శన చేసి మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డుని గెలుచుకున్న జస్ ప్రీత్ బుమ్రా సైతం టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపాడు. టీచర్లు ఉన్న కుటుంబం నుంచి వచ్చానని టీచర్ల విలువ ఏంటో తనకు బాగా తెలుసని అన్నాడు. హ్యాపీ టీచర్స్ డే అంటూ ట్వీట్ చేశాడు.