
ఆ ఉద్యోగానికి వెళ్లలేదు..
ముఖేష్ కుమార్ పుట్టింది బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో. ఇక్కడి యువకులు ఎక్కువగా సీఆర్‌పీఎఫ్, భారత ఆర్మీలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ముఖేష్‌ను కూడా సీఆర్‌పీఎఫ్‌కు పంపాలని అతని కుటుంబం అనుకుంది. ముఖేష్ కూడా సీఆర్‌పీఎఫ్ ఉద్యోగం కోసం పరీక్షలు రాశాడు. కానీ అప్పటికే క్రికెట్ అంటే ఇష్టం ఏర్పడిన అతను.. ఆ ఉద్యోగం కోసం అంత కష్టపడలేదు. ఈ నేపథ్యంలోనే 2012లో బీకాం డిగ్రీ పూర్తి చేశాడు. ఇక అప్పుడు కొడుకుకు మద్దతుగా నిలిచిన ముఖేష్ తండ్రి.. అతన్ని కోల్‌కతా పిలిపించాడు.

తిండి సరిగా లేక..
కోల్‌కతా వచ్చిన తర్వాత అక్కడ కాళీఘాట్ క్లబ్‌లో ముఖేష్ చేరాడు. సెకండ్ డివిజన్‌లో అతన్ని ఉంచారు. అయితే ఆ డివిజన్‌లో ఉన్న మిగతా బౌలర్ల కంటే ముఖేష్ వేగంగా బౌలింగ్ చేసేవాడు. ఉదయాన్నే ప్రాక్టీస్ సమయంలో ముఖేష్ వేసే అవుట్ స్వింగర్‌లు ఎడ్జ్ తీసుకొని వచ్చినా స్లిప్స్‌లో ఉండే ఫీల్డర్లు క్యాచులు పట్టుకోలేకపోయేవాళ్లు. ఆ తర్వాత అందరితోపాటు ముఖేష్‌కు కూడా మెడికల్ టెస్టులు చేశారు. ఈ పరీక్షల్లో ముఖేష్‌కు సరిగా ఆహారం అందకపోవడంతో.. ఉండాల్సినంత బరువు లేడని తేలింది. ఈ విషయం తెలిసిన అతని తండ్రి చాలా బాధపడ్డాడు.

ఈడెన్ గార్డెన్స్‌లోనే..
ముఖేష్ పరిస్థితి తెలుసుకున్న కోచ్.. అతని గురించి అప్పట్లో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (సీఏబీ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో మాట్లాడాడు. దీంతో ఈడెన్ గార్డెన్స్‌లో ముఖేష్ ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. అక్కడే అతనికి కావలసిన ఆహారం కూడా దొరికేది. ఆ తర్వాత అన్ని విభాగాల్లో రాణించిన అతను.. చివరి ఐదు దేశవాళీ సీజన్లలో అద్భుతంగా రాణించాడు. మొత్తం 27 మ్యాచుల్లోనే 100 వికెట్లు తీసుకున్నాడు. 'ముఖేష్ తీసుకునే వికెట్లు టెయిలెండర్లవి కావు. అతను తీసుకున్న వాటిలో అత్యధిక వికెట్లు టాపార్డర్ బ్యాటర్లవే' అని బెంగాల్ జట్టు కోచ్ చెప్పాడు.

ఫైనల్ ఆడుతుండగా తండ్రికి అనారోగ్యం..
బెంగాల్ తరఫున అతను అద్భుతంగా రాణిస్తూ.. 2019-20 సీజన్‌లో ఫైనల్ చేరుకున్నాడు. ఆ సమయంలోనే ముఖేష్ తండ్రి మంచానపడ్డాడు. ఆ సమయంలో ఉదయమంతా క్రికెట్ ఆడి, సాయంత్రం ఆస్పత్రిలో తండ్రి బాగోగులు చూసుకునేవాడినని ముఖేష్ చెప్పాడు. కానీ బ్రెయిన్ హేమరేజ్‌తో అతని తండ్రి కొన్నిరోజుల్లోనే మరణించాడు. ఈ బాధ నుంచి బయట పడిన ముఖేష్ మళ్లీ దేశవాళీల్లో సత్తా చాటాడు. చివరకు భారత్‌తో మూడు వన్డేల సిరీస్ కోసం సౌతాఫ్రికా ఇక్కడకు వచ్చినప్పుడు.. టీమిండియాకు కూడా ఎంపికయ్యాడు.

వేలంలో హోరా హోరీ..
దేశవాళీలతోపాటు ఇండియా ఎ తరఫున కూడా అత్యద్భుతంగా రాణించిన ముఖేష్‌ను కొనుగోలు చేయడానికి ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించాయి. అతని కోసం ఐపీఎల్ మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ చాలా గట్టిగా పోటీ పడ్డాయి. బేస్ ధర రూ.20 లక్షలతో మొదలైన అతన్ని.. చివరకు రూ.5.5 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో ఆడటం తన తండ్రి కోరిక అని, ఇక్కడి నుంచి తన కెరీర్‌లో మరింత ముందుకు వెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నానని ముఖేష్ చెప్పాడు.


Click it and Unblock the Notifications












