ధోనీ సహజసిద్ధ కీపర్ కాదు.. కార్తీక్ నేచురల్ ప్లేయర్: తైబు

హరారే: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సహజసిద్ధ కీపర్ కాదు అని జింబాబ్వే మాజీ కెప్టెన్ తతెంద తైబు అన్నాడు. ధోనీ మానసిక దృఢత్వమే అతన్ని ప్రత్యేకమైన ఆటగాడిగా నిలిపిందన్నాడు. వాస్తవానికి మహీ కీపింగ్ సహజంగా ఉండదని, ఆ మాటకొస్తే ఆస్ట్రేలియా మాజీ కీపర్ ఆడమ్ గిల్‌గ్రిస్ట్ కీపింగ్ కూడా అదే కోవలోకి వస్తుందని తైబు పేర్కొన్నాడు. వికెట్ కీపర్/బ్యాట్స్‌మన్‌గా ఎంఎస్ ధోనీ కంటే దినేష్ కార్తీక్ నేచురల్ ప్లేయర్ అని తైబు చెప్పుకొచ్చాడు.

ధోనీ కంటే కార్తీక్ సహజసిద్ధ ఆటగాడు:
తతెంద తైబు తాజాగా యూట్యూబ్ షో ఫ్యాన్ ప్లే-స్పోర్ట్స్ రూలర్ 'ఇన్సైడ్ అవుట్ విత్ బ్యాగ్స్'లో మాట్లాడుతూ... 'ఇండియా-ఏ తరఫున ఆడుతున్నప్పుడు ఎంఎస్ ధోనీని మొదటిసారి చూశా. నిజాయితీగా చెప్పాలంటే.. ధోనీ కంటే కార్తీక్ సహజసిద్ధ ఆటగాడు అని నేను అనుకున్నా. కార్తీక్ కీపింగ్ విషయంలో మరింత సహజంగా ఉంటాడు. అలానే బ్యాటింగ్‌లో కూడా' అని అన్నాడు. తైబు జింబాబ్వే తరఫున 28 టెస్టులు, 150 వన్డేలు, 17 టీ20లు ఆడాడు.

మానసిక దృఢత్వం వల్లే:
'ఎంఎస్ ధోనీ కీపింగ్ చేస్తున్నప్పుడు అతడి రెండు చేతులు ఒక్కచోట ఉండవు. సహజంగా వికెట్ల వెనుక ఉన్నప్పుడు రెండు చేతుల చిటికెన వేళ్లు ఒకదానితో ఒకటి తాకుతూ ఉంటాయి. కానీ ధోనీ విషయంలో అలా ఉండదు. అయినప్పటికీ అతడు రెప్పపాటులో బెయిల్స్ ఎగరగొడతాడు. ఈ టెక్నిక్ సహజమైనది కాదు. కానీ అతడు దాన్ని చాలా పక్కాగా చేస్తాడు. బ్యాటింగ్ విషయంలోనూ అంతే. కంటికి, చేతికి మధ్య సమన్వయంతో పాటు మానసిక దృఢత్వం వల్లే అతడు తన ప్రత్యేకత చాటుకుంటున్నాడు' అని తైబు చెప్పాడు.

గిల్‌క్రిస్ట్ సహజసిద్ధమైన బ్యాట్స్‌మన్:
'సాధారణంగా ఇలాంటి టెక్నిక్ కోచ్‌లు చూడకపోతే.. పక్కన పెట్టడం చాలా సులభం. కానీ ధోనీ తన గణాంకాలతో అవన్నింటినీ పటాపంచలు చేసాడు. ఆడమ్ గిల్‌క్రిస్ట్ సహజసిద్ధమైన బ్యాట్స్‌మన్. కానీ సహజసిద్ధ కీపర్ మాత్రం కాదు. అతడి ఆట చూస్తే.. ఎవరికైనా అర్థమవుతుంది. అందుకే అతడు బ్యాటింగ్ కన్నా వికెట్ కీపింగ్‌పై ఎక్కువ దృష్టిపెట్టేవాడు' అని తైబు పేర్కొన్నాడు. అతి పిన్న వయసులో జింబాబ్వే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన తైబు.. అంతర్జాతీయ క్రికెట్‌లో మంచి వికెట్ కీపర్‌గా గుర్తింపు సాధించాడు.

350 వన్డేలు, 98 టీ20లు:
ఎంఎస్ ధోనీ తన కెరీర్‌లో ఇప్పటివరకు 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడగా.. దినేష్ కార్తీక్ భారత జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడు. గత సంవత్సరం ప్రపంచ కప్‌లో పేలవమైన ప్రదర్శన కారణంగా బీసీసీఐ సెలెక్టర్లు అతని పేరును కూడా పరిశీలించట్లేదు. కార్తీక్ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు 26 టెస్టులు, 94 వన్డేలు, 32 టీ20లు ఆడాడు.

ప్రపంచకప్ తర్వాత దూరం:
2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ఎంఎస్ ధోనీ టీమిండియాకి దూరమయ్యాడు. బీసీసీఐ సెలక్షన్‌కు కూడా అందుబాటులో ఉండడం లేదు. దీంతో సెంట్రల్ కాంట్రాక్టు నుండి అతనిని బీసీసీఐ తప్పించింది. ఇక మహీ స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌కి భారత సెలక్టర్లు వరుసగా అవకాశాలిచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2020 నిరవధిక వాయిదా పడింది. దీంతో ధోనీ ప్రొఫెషనల్ క్రికెట్‌లోకి తిరిగి రావడాన్ని ఆలస్యం చేసింది. ఐపీఎల్‌లో మహీ బాగా రాణించినట్లయితే.. అక్టోబర్-నవంబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ ఆడే అవకాశం ఉండేది. కానీ పరిస్థితి ఇప్పుడు అలా లేదు. లీగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో కచ్చితంగా చెప్పలేం. దీంతో ధోనీ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తు డైలమాలో పడింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications