India's tour of Bangladesh: భారత జట్టు మొన్నటివరకు శ్రీలంక పర్యటనలో బిజీగా గడిపింది. మూడు టీ20 ఇంటర్నేషనల్స్ సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఆడిన మూడింట్లోనూ ఘన విజయాన్ని అందుకుంది. లంకేయులను 3-0 తేడాతో మట్టికరిపించింది. సూపర్ ఓవర్ దాకా వెళ్లిన చివరి మ్యాచ్ మినహా మిగిలిన రెండింట్లోనూ వార్ వన్‌సైడ్ అయింది.
ఈ జైత్రయాత్రకు వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్‌లో బ్రేక్ వేశారు లంకేయులు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన తొలి రెండు వన్డేల్లోనూ భారత్‌కు షాకుల మీద షాకులు ఇచ్చారు. తొలి వన్డేను టై చేశారు. రెండు, మూడు మ్యాచ్‌లల్లో దిగ్విజయాన్ని సొంతం చేసుకున్నారు. భారత్‌ను మట్టికరిపించారు. మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకున్నారు.

ఈ రెండు మ్యాచ్‌లల్లో టీమిండియా స్పిన్నర్ల చేతిలో మట్టికరిచింది. రెండో వన్డేలో జెఫ్రీ వాండర్సే, మూడో వన్డేలో దునిత్ వెల్లలగే దుమ్ము దులిపారు. పిచ్‌ను తమకు అనుకూలంగా మలచుకుని చెలరేగారు.బ్యాటింగ్ ఆర్డర్‌ను చిత్తు చేశారు. తమ స్పిన్ మాయాజాలంలో నడ్డివిరిచారు.
ఇదే పరిస్థితి బంగ్లాదేశ్ పర్యటనలోనూ తలెత్తే అవకాశాలు లేకపోలేదు. బంగ్లాదేశ్ టెస్ట్ జట్టులో వెటరన్ పేస్ బౌలర్ తస్కిన్ అహ్మద్ మళ్లీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. రెండు టెస్ట్ మ్యాచ్‌లల్లో పాకిస్తాన్‌తో తలపడబోయే జట్టు కోసం అతన్ని ఎంపిక చేసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్.
తొలి మ్యాచ్ ఈ నెల 21వ తేదీన రావల్పిండిలో ఆరంభం కానుంది. అదే నెల 30వ తేదీన రెండో టెస్ట్‌కు కరాచి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ఈ సిరీస్ ఆడబోయే 15 మంది సభ్యుల జట్టులో తస్కిన్ అహ్మద్‌కు చోటు దక్కింది. 2023 తరువాత జూన్ తరువాత అతను ఆడబోయే తొలి టెస్ట్ సిరిస్ ఇదే అవుతుంది.
నజ్ముల్ హొస్సేన్ శాంటో (కేప్టెన్), మహ్మదుల్ హసన్ జాయ్, జకీర్ హసన్, షాద్మాన్ ఇస్లాం, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్, మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, నయీమ్ హసన్, నహిద్ రానా, షోరీఫుల్ ఇస్లాం మహమూద్, తస్కిన్ అహ్మద్, సయ్యద్ ఖలీద్ అహ్మద్.. పాకిస్తాన్ వెళ్లనున్నారు.
దీని తరువాత భారత్.. బంగ్లాదేశ్ పర్యటనకు బయలుదేరి వెళ్లనుంది. రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఇది. ఈ రెండు టెస్టులూ సెప్టెంబర్ 19, 27వ తేదీల్లో ఆరంభమౌతాయి. అనంతరం మూడు టీ20 మ్యాచ్‌ల సిరిస్ మొదలవుతుంది. అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో ఈ మ్యాచ్‌లు షెడ్యూల్ అయ్యాయి. పాకిస్తాన్‌కు ఎంపిక చేసిన తస్కిన్ అహ్మద్ ఇక్కడా భారత్‌కు ఎదురుపడే అవకాశం ఉంది.