ఐపీఎల్ 2025 వచ్చేసింది. మార్చి 22 నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. మొత్తం 10 జట్లు బరిలోకి దిగుతున్నాయి. అయితే ఈ సారి ఎన్నో మార్పులతో ఐపీఎల్ జరుగుతోంది. చాలా కాలం పాటు మరో జట్టులో కొనసాగిన ఆటగాళ్లు.. ఇప్పుడు ఇంకో జెర్సీ ధరించి ఆడేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇదే సమయంలో ఐపీఎల్ లో ఆడిన ఓ మాజీ ప్లేయర్.. ఇప్పుడు అంపైర్ అవతారమెత్తాడు. అతడు మరెవరో కాదు విరాట్ సహచరుడు తన్మయ్ శ్రీవాస్తవ.
అండర్ 19 వరల్డ్ కప్ హీరో..
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 2008లో అండర్-19 వరల్డ్ కప్ గెలిచింది భారత జట్టు. అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ భారత క్రికెట్‌లో బడా స్టార్. అలానే ఆ అండర్ 19 వరల్డ్ కప్ జట్టులో ఉన్న రవీంద్ర జడేజా కూడా ఇప్పుడు పెద్ద స్టారే. మనీశ్ పాండే కూడా ఇండియాకు ఆడాడు. కానీ అదే వరల్డ్ కప్ ఫైనల్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన శ్రీవాస్తవ మాత్రం ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకుండానే ఐదేళ్ల క్రితమే ఆటకు వీడ్కోలు పలికాడు. ఇప్పుడు అతడు ఐపీఎల్ కొత్త పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యాడు. అంపైర్ అవతారమెత్తుతున్నాడు. తద్వారా ఐపీఎల్ ఆడటంతో పాటు అంపైరింగ్ చేసిన తొలి ప్లేయర్ గా నిలువనున్నాడు. తాజాగా ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటన వెలువడింది.
ఉత్తర్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (UPCA) సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెలిపింది. "నిజమైన ఆటగాడు ఎప్పుడూ మైదానం వీడాలనుకోడు. ఇక్కడ అతడి పాత్ర మాత్రమే మారింది. తన్మయ్ శ్రీవాస్తవకు ఆల్ ది బెస్ట్." అని రాసుకొచ్చింది. కాగా, అంతకుముందు శ్రీవాస్తవ. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరఫున కొన్ని మ్యాచులు ఆడాడు. ఐపీఎల్ 2008, 2009లో ఆడాడు. విశేషమేమిటంటే.. కోహ్లీ, రవీంద్ర జడేజా ఇంకా ఐపీఎల్‌లో ఆడుతున్న సంగతి తెలిసిందే.
