
ముంబై: మహమ్మారి కరోనా వైరస్ (కోవిడ్-19) భయంతో ప్రపంచం వణికిపోతున్న తరుణంలో టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ దేశ ప్రజలందరికీ ఓ విన్నపం చేశాడు. కరోనా బారి నుంచి ప్రజలంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం నడుచుకోవాలని చెప్పాడు. తగిన జాగ్రత్తలతో కరోనాను నివారిద్దామని పిలుపునిచ్చాడు.
'అందరం ముందస్తు జాగ్రత్తలు తీసుకొని బాధ్యతాయుతంగా వ్యవహరిద్దాం. కరోనా వైరస్ లక్షణాలు కన్పిస్తే.. వెంటనే పరీక్షలు చేయించుకోండి. ఒకవేళ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలితే.. తక్షణమే స్వీయ నిర్బంధంలోకి వెళ్లండి. తద్వారా ఇతరులకు వ్యాధి సోకకుండా కాపాడిన వారవుతారు. మనమంతా కలిసికట్టుగా పోరాడి కరోనాను పారదోలదాం' అని లక్ష్మణ్ ట్వీట్ చేశాడు.
2001 కోల్‌కతా టెస్టులో వీవీఎస్ లక్ష్మణ్ మహత్తర 281 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే కుప్పకూలి ఫాలోఆన్‌లో పడిన భారత్.. అసలు మ్యాచ్‌ను డ్రా చేసుకుంటేనే గొప్ప అనుకుంటే.. ఏకంగా విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో 232 పరుగులకే సచిన్, గంగూలీలతో సహా నాలుగు వికెట్లు పడిన స్థితిలో ద్రవిడ్ (180) జతగా లక్ష్మణ్ మాయ చేశాడు. మణికట్టు షాట్లతో, మైమరిపించే డ్రైవ్‌లతో, మెరుపు కట్‌షాట్లతో స్కోరు పెంచుతూ.. భారత క్రికెట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన గావస్కర్ (236) రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ఇన్నింగ్స్ ఎప్పటికీ ప్రత్యేకమే.
'ప్రజలందరూ కరోనా వైరస్‌పై పోరాడేందుకు దృఢచిత్తంతో ముందుకు కదలండి. కరోనా వ్యాప్తికి వ్యతిరేకంగా పోరాడదాం. అందరూ ముందుజాగ్రత్త చర్యలు తీసుకోండి. ముఖ్యంగా వైరస్ బారిన పడకుండా నివారణ చర్యలు తీసుకోవడమే ఉత్తమ మార్గం' అని శనివారం ట్విటర్ వేదికగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సూచించాడు. కరోనా వైరస్ ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా జరిగే పలు క్రీడల పోటీలను వాయిదా వేసిన నేపథ్యంలో కోహ్లీ దేశ ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు చెప్పాడు. కోహ్లీ శుక్రవారం విమానాశ్రమంలో మాస్క్ వేసుకుని కనిపించాడు.
'ఈ కఠిన సమయంలో అందరం దైర్యంగా ఉండి ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకుందాం. ఆరోగ్య నిపుణులు ఇచ్చిన సూచనలను పాటిస్తూ.. సురక్షితంగా ఉండాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా' అని లోకేష్ రాహుల్ ట్వీట్ చేసాడు. దేశంలో కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో శుక్రవారం బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాతో జరగాల్సిన వన్డే సిరీస్‌ను రద్దు చేయగా.. అంతకుముందే ఐపీఎల్‌ను ఏప్రిల్ 15కు వాయిదా వేసింది. దీంతో కోహ్లీసేనకు అనుకోని విశ్రాంతి లభించింది.