
హైదరాబాద్: దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2020 టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. దీంతో ముంబై ఆటగాళ్లపై ప్రశంసలు జల్లు కురుస్తోంది. ఐదోసారి టైటిల్ ఎగరేసుకుపోవడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పాటు మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, సురేశ్ రైనా, వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్ సింగ్, వసీం జాఫర్ లాంటి వారు ట్విటర్‌లో అభినందనలు తెలిపారు. ఇక బాలీవుడ్ నటులు రణ్‌వీర్ సింగ్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సంతోషం వ్యక్తం చేశారు.
వీరందరిలోకెల్ల కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాటింగ్ కోచ్, మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. ముంబై ఇండియన్స్‌కు కంగ్రాట్స్ చెప్పిన తీరు అందరిని నవ్వుల్లో ముంచెత్తుతోంది. 'కంగ్రాట్స్ ముంబై ఇండియన్స్. మీరు రెండేళ్ల పాటు విశ్రాంతి తీసుకోండి.. ఇప్పటి వరకూ సాధించింది ఇక చాలు' అని జాఫర్ సరదాగా ట్వీట్ చేశాడు. ఎప్పటికి మిరే కొడతారా ఐపీఎల్ కప్.. మిగతావారికి కూడా అవకాశం ఇవ్వడానికి రెండేళ్ల పాటు ఆడకండి అని జాఫర్ చెప్పకనే చెప్పాడు. ముంబై ఆటగాళ్లు మైదానంలో దిగిన ఫొటోను కూడా పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
ఐపీఎల్ ఆడకుండా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌పై నిషేధం విధించాలని ఇటీవల కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సరాదాగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో 5 వేల చొప్పున పరుగులు చేసిన కోహ్లీ, డివిలియర్స్‌పై నిషేధం విధించాలని, ఇతర ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని రాహుల్ సరదాగా కోరాడు.
'ముంబై ఆటగాళ్లది అద్భుతమైన విజయం. ముంబై పల్టాన్స్‌ది సంపూర్ణ ఆధిపత్యం. గతేడాది ఎక్కడైతే నిలిచారో అక్కడి నుంచే తిరిగి ప్రారంభించారు' అని సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. 'ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 ఫ్రాంఛైజీ, అత్యుత్తమైన సారథి. ముంబై జట్టు విజయానికి నిజమైన అర్హత కలిగింది. అనేక సవాళ్లను ఎదుర్కొని టోర్నీని దిగ్విజయంగా నిర్వహించారు' వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
'ఇషాన్ కిషన్ సూపర్ స్ట్రైకర్. భవిష్యత్‌లో తప్పకుండా టీమిండియాకు ఆడే సత్తా ఉన్న ఆటగాడు. నా దృష్టిలో ఇప్పుడే భారత జట్టుకు ఆడగలిగే ఆటగాడు. ఈ సీజన్‌లో అద్భుతంగా రాణించిన ఇషాన్ కిషన్‌కు అభినందనలు. ముంబై టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు. ఐదోసారి గెలుపొందడం గొప్ప విషయం' అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు.
'13వ సీజన్‌లో విజేతగా నిలిచిన ముంబై పల్టాన్స్‌కు అభినందనలు. బీసీసీఐ పట్ల ఎంతో గర్వంగా ఉంది. కఠినమైన పరిస్థితుల్లో ఎంతో దిగ్విజయంగా ఈ సీజన్‌ను నిర్వహించారు. అలాగే ఇలాంటి సమయంలో ఆటగాళ్ల ఆరోగ్య భద్రత గురించి శ్రద్ధ వహించిన బీసీసీఐ మెడికల్ టీమ్‌కు కూడా ధన్యవాదాలు' అని వీవీఎస్ లక్ష్మణ్ ట్వీటారు.
'రోహిత్ శర్మ లాంటి గొప్ప సారథి నేతృత్వంలో ముంబై పల్టాన్స్ మరోసారి విజేతగా నిలిచినందుకు అభినందనలు. అలాగే ఫైనల్స్ చేరడానికి ఢిల్లీ జట్టు కూడా ఎంతో శ్రమించింది' అని సురేశ్ రైనా అన్నాడు.