
హైదరాబాద్: క్రికెట్‌లో అప్పుడప్పుడూ కొన్ని అరుదైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. దాంతో ఎవరూ ఊహించని రీతిలో బ్యాట్స్‌మెన్ పెవిలియన్ బాట పడుతుంటారు. ఎక్కువ శాతం ఫీల్డర్లు తమ విన్యాసాలతో అద్భుతమైన క్యాచ్‌లు పడుతుంటారు. యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2020లో ఇలాంటివి చాలానే చూశాం. మెన్స్ క్రికెట్‌లోనే కాదు.. వుమెన్స్ క్రికెట్‌లోనూ ఫీల్డర్ల స్టన్నింగ్ క్యాచ్‌లు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. ఐపీఎల్ తరహాలోనే సాగుతున్న వుమెన్స్ బిగ్‌బాష్ (బీబీఎల్) లీగ్‌లో ఓ అద్భుతమైన ఫీల్డింగ్ ఫీట్ చోటుచేసుకున్నది.
తాజాగా మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో ఓ డైవింగ్ క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. బ్రిస్బేన్ హీట్ వుమెన్ వర్సెస్ అడిలైడ్ స్ట్రయికర్స్ వుమెన్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో ఈ స్టన్నింగ్ క్యాచ్ వెలుగు చూసింది. 17 బంతుల్లో 35 పరుగులు చేయాల్సిన తరుణంలో.. అడిలైడ్ స్పిన్నర్ అమంద వెల్లింగ్టన్ విసిరిన ఫుల్‌టాస్ బంతిని అమెలియా కేర్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడింది. ఆ షాట్ చూసిన అందరూ బౌండరీకి వెళుతుందని అనుకున్నారు.
షార్ట్ మిడ్ వికెట్ మీదుగా గాల్లో వెళ్తున్న ఆ బంతిని మ్యాడీ పెన్ని అందుకునే ప్రయత్నం చేసింది. ఆమె చేతులను తాకుతూ బంతి అమాంతం పైకి లేచింది. ఆపై బంతి కింద పడబోయింది. అయితే పెన్నాకు సమీపంలోనే ఉన్న తాహిలా మెక్‌గ్రాత్ అద్భుత రీతిలో డైవ్ చేస్తూ ఆ క్యాచ్‌ను అందుకున్నది. ఇంకేముందు అమెలియా కేర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అప్పటికే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న బ్రిస్బేన్ తాజా వికెట్‌తో ఒత్తిడికి లోనైంది. ఫలితంగా అడిలైడ్ జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రయికర్స్ వుమెన్ జట్టు 20 ఓవర్లకు 153 పరుగులు చేయగా.. బ్రిస్బేన్ హీట్ వుమెన్ జట్టు 135 పరుగులే చేయగలిగింది. మెక్‌గ్రాత్ అద్భుత రీతిలో డైవ్ చేస్తూ ఆ క్యాచ్ పట్టడమే మ్యాచ్ మలుపు తిరిగింది. దాంతో అడిలైడ్ విజయాన్ని అందుకుంది. పెన్ని, మెక్‌గ్రాత్‌లకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియోను అడిలైడ్ స్ట్రయికర్స్ జట్టు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'వాట్ ఏ క్యాచ్' అని కాప్షన్ పెట్టింది. ఈ వీడియో చూసిన ఫాన్స్ స్టన్నింగ్ డైవ్ క్యాచ్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్యాచ్ వీడియోను మీరూ చూడండి.