టీ20 వరల్డ్ కప్-2024లో సూపర్-8 రేసు హీటెక్కింది. లీగ్ మ్యాచ్‌లు ప్రారంభమై పది రోజులు దాటడంతో తదుపరి దశ సమీకరణాలు ఖరారయ్యాయి. అయితే అనూహ్యంగా కొన్ని పసికూన జట్లు సూపర్-8 రేసులో ముందంజలో ఉన్నాయి. మరోవైపు స్ట్రాంగ్ టీమ్స్ అయిన ఇంగ్లండ్, పాకిస్థాన్, న్యూజిలాండ్ ముంగిట సవాళ్లు నిలిచాయి. ఈ నేపథ్యంలో గ్రూప్-ఏ, గ్రూప్-బీలోని జట్లకు ఎంతెంత అవకాశం ఉందో చూద్దాం!!
ఏంటీ సూపర్-8?
ఈ సారి పొట్టి కప్‌లో ఇరవై జట్లు బరిలోకి దిగాయి. నాలుగు గ్రూప్‌లు విడిపోయి తలపడుతున్నాయి. అయితే ఆయా గ్రూప్‌ల్లో నిలిచిన టాప్-2 జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. తదుపరి దశకు చేరుకునే ఈ ఎనిమిది జట్లు సెమీఫైనల్స్ బెర్తు కోసం నాలుగు జట్ల చొప్పున రెండు గ్రూప్‌లు విడిపోయి పోటీపడతాయి. A1, B2, C1,D2 ఒక గ్రూప్‌లో, A2, B1, C2,D1 మరో గ్రూప్‌లో ఉంటాయి. (A1, A2 అంటే గ్రూప్-ఏలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు)

గ్రూప్-ఏలో అవకాశాలు ఎలా ఉన్నాయి?
భారత్ (4 పాయింట్లు, 1.455 NRR): అమెరికా, కెనడాతో జరగనున్న మ్యాచ్‌లో ఓ విజయం సాధించి, మెరుగైన రన్‌రేటు ఉంటే సునాయసంగా సూపర్-8కు చేరుకుంటుంది. టీమిండియా తదుపరి దశకు వెళ్లడం దాదాపు ఖాయమే.
అమెరికా (4 పాయింట్లు, 0.626 NRR): అమెరికాది కూడా భారత్ పరిస్థితే. ఇండియా, ఐర్లాండ్‌తో జరగనున్న మరో మ్యాచ్‌లో గెలిస్తే తదుపరి దశకు చేరుకుంటుంది. మిగిలిన రెండింట్లో ఓడిస్తే పాక్ అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.
కెనడా (2 పాయింట్లు, -0.274 NRR): పోటీలో ఉండాలంటే తర్వాతి మ్యాచ్‌ల్లో పాకిస్థాన్, భారత్‌పై కెనడా విజయం సాధించడానికి ప్రయత్నించాలి. పాక్‌తో జరిగే మ్యాచ్ ఎంతో కీలకం. అయితే స్ట్రాంగ్ టీమ్స్‌ను కెనడా ఎలా ఓడిస్తుందనేది ఆసక్తికరం.
పాకిస్థాన్ (0 పాయింట్లు, -0.150 NRR): టోర్నీలో నిలవాలంటే పాకిస్థాన్ కెనడా, ఐర్లాండ్‌తో ఆడనున్న మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిందే. అంతేగాక భారత్ లేదా అమెరికా మిగిలిన మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి.
ఐర్లాండ్ (0 పాయింట్లు, -1.712 NRR): పాక్ పరిస్థితే ఐర్లాండ్‌ది కూడా. యూఎస్‌ఏ, పాకిస్థాన్‌పై తప్పక గెలవాలి. ఆ తర్వాత ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాలి.
గ్రూప్-బీలో అవకాశాలు
స్కాట్లాండ్ (5 పాయింట్లు, 2.164 NRR): ఆస్ట్రేలియాపై విజయం సాధిస్తే సునాయాసంగా సూపర్-8కు వెళ్తుంది. ఒకవేళ ఓడినప్పటికీ ఛాన్స్ ఉంటుంది. ఇంగ్లండ్ ఓ మ్యాచ్‌లో ఓడిపోవాలి లేదా ఇంగ్లండ్ మ్యాచ్ రద్దవ్వాలి లేదా తమ కంటే తక్కువ నెట్‌రన్‌రేటుతో నిలవాలి.
ఆస్ట్రేలియా (4 పాయింట్లు, 1.875 NRR): తర్వాత జరగనున్న నమీబియా, స్కాట్లాండ్ మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా ఆస్ట్రేలియా సూపర్-8కు చేరుకుంటుంది.
నమీబియా (2 పాయింట్లు, -0.309 NRR): ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లండ్‌పై నమీబియా తప్పక విజయం సాధించాలి. ఇది నమీబియాకు సవాలే.
ఇంగ్లండ్ (1 పాయింట్, -1.800 NRR): తదుపరి దశకు చేరుకోవాలంటే ఒమన్, నమీబియాపై ఇంగ్లండ్ తప్పక నెగ్గాలి. అలాగే ఆస్ట్రేలియా చేతిలో స్కాట్లాండ్ ఓడాలి. స్కాట్లాండ్ కంటే మెరుగైన నెట్‌రన్‌రేటు సాధించాలి. ఒకవేళ ఆస్ట్రేలియా స్కాట్లాండ్ చేతిలో ఓడి, నమీబియాపై నెగ్గితే ఇంగ్లండ్ ఇంటిముఖం పట్టాల్సిందే.
ఒమన్ (0 పాయింట్, -1.613 NRR): ఆడిన మూడింట్లో ఓడిన ఒమన్ సూపర్-8కు అర్హత సాధించే అవకాశాలు లేవు.