టీ20 వరల్డ్ కప్-2024లో మరో ఊహించని ఫలితం. ఆస్ట్రేలియాను అఫ్గానిస్థాన్ ఓడించింది. కింగ్స్‌టౌన్‌లోని సెయింట్ విన్సెంట్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌పై 21 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, మెరుపు ఫీల్డింగ్‌తో చారిత్రక విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 148 పరుగులు చేసింది.
ఓపెనర్లు గుర్బాజ్ (60; 49 బంతుల్లో, 4 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇబ్రహీం జద్రాన్ (51; 48 బంతుల్లో, 6 ఫోర్లు) అర్ధశతకాలతో సత్తాచాటారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 11.5 ఓవర్లలో 118 పరుగులు జోడించారు. ప్యాట్ కమిన్స్ (3/28) హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. ఆడమ్ జంపా (2/28) రెండు వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది.

గుల్బాదిన్ నైబ్ (4/20) నాలుగు, నవీనుల్ హక్ (3/20) మూడు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించారు. గత వన్డే వరల్డ్ కప్ తరహాలో జట్టును గెలిపించాలనుకున్న గ్లెన్ మాక్స్‌వెల్ (59; 41 బంతుల్లో, 6 ఫోర్లు, 3 సిక్సర్లు)కు ఈసారి నిరాశే మిగిలింది. మందకొడి పిచ్‌పై మాక్సీ పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది. అయితే మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ ఓటమి కారణాలు వివరించాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం వల్ల పరాజయాన్ని చవిచూడలేదని అన్నాడు. పేలవ ప్రదర్శనే ఓటమికి కారణమని అన్నాడు.
ప్రస్తుత వరల్డ్ కప్‌లో సెయింట్ విన్సెంట్ వేదికగా జరిగిన నాలుగు మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న జట్టే గెలిచింది. కానీ మిచెల్ మార్ష్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ నిర్ణయం తమ ఓటమికి కారణం కాదని, అఫ్గానిస్థాన్ గొప్పగా ఆడిందని మార్ష్ చెప్పాడు. ''అఫ్గానిస్థాన్ 20 పరుగులు అదనంగా సాధించింది. నిజాయతీగా చెప్పాలంటే వాళ్లు గొప్పగా ఆడారు. మొత్తం క్రెడిట్ వాళ్లకే ఇవ్వాలి మేం ఇవాళ పేలవ ప్రదర్శన చేశాం''
''స్టేడియం రికార్డుల పరంగా తొలుత బ్యాటింగ్ చేయడమే సరైనదిగా మేం భావించలేదు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఎన్నో జట్లు తొలుత బౌలింగ్ చేశాయి. వికెట్‌పై అవగాహనతో తర్వాత ఆడాయి. టాస్ వల్లే మేం మేం ఓడిపోలేదు. ఈ పిచ్ ఇరు జట్లకు అంత తేలిక కాదు. ఇక భారత్‌పై తప్పక గెలవాలనే స్పష్టత మాకు వచ్చింది. ఇలాంటి డూ ఆర్ డై మ్యాచ్‌లో భారత్‌ను ఓడించే సవాల్ కంటే మరొకటి గొప్పది ఉండదు'' అని మిచెల్ మార్ష్ అన్నాడు.