పసికూన అమెరికా చేతిలో పాకిస్థాన్ అనూహ్య పరాజయాన్ని చవిచూడటంపై ఆ దేశ దిగ్గజ బౌలర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. పాక్ ఓటమి తనని ఎంతో బాధించిందని అన్నాడు. టీ20 వరల్డ్ కప్-2024లో తమ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చెత్త ప్రదర్శనతో ఓటిమి మూటగట్టుకున్న విషయం తెలిసిందే. డల్లాస్ వేదికగా యూఎస్‌ఏతో గురువారం జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ పోరులో పాక్ తడబడింది.
మొదట పాకిస్థాన్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 159 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ అజామ్ (44; 43 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. కెంజిగె (3/30), సౌరభ్ నేత్రావల్కర్ (2/18) సత్తాచాటారు. అనంతరం ఛేదనలో అమెరికా మూడు వికెట్లు కోల్పోయి సరిగ్గా 159 పరుగులే చేసింది. సారథి మొనాంక్ పటేల్ (50; 38 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్) హాఫ్ సెంచరీ సాధించాడు. మహ్మద్ అమీర్, నసీమ్ షా, హారిస్ రవూప్ తలో వికెట్ తీశారు.

స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్‌ఏ వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. అయితే మొదటి మూడు బంతులకు అమీర్ ఏడు పరుగులే ఇచ్చాడు. కానీ ఆ తర్వాత అమీర్ లయ తప్పడం, పేలవ వికెట్ కీపింగ్‌తో ఏడు పరుగులను వైడ్ల రూపంలోనే సమర్పించుకున్నారు. అనంతరం సూపర్ ఓవర్ ఛేదనలో పాకిస్థాన్ వికెట్ కోల్పోయి 13 పరుగులే చేసింది. సౌరభ్ నేత్రావల్కర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు.
''టీ20 ప్రపంచకప్‌ను పాకిస్థాన్ గొప్పగా ఆరంభించలేదు. అమెరికా చేతిలో ఓటమిపాలై తీవ్ర నిరాశ కలిగించింది. 1999 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ చేతిలో కోరుకోని ఓటమి చవిచూసినట్లుగానే ఈ టోర్నీలో అపకీర్తి మూటగట్టుకున్నాం. అయితే ఈ మ్యాచ్‌లో విజేతగా నిలవడానికి పాకిస్థాన్‌కు అర్హత లేదు. యూఎస్‌ఏనే బాగా ఆడింది. శాసించే స్థానంలో నిలిచింది. అమీర్, షాహిన్ అఫ్రిది మ్యాచ్‌ను కాపాడటానికి ప్రయత్నించారు. కానీ దుదృష్టవశాత్తు విజయాన్ని అందుకోలేకపోయాం'' అని షోయబ్ అక్తర్ అన్నాడు.
1999 వన్డే వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓటమిపాలైంది. అనంతరం టోర్నీలో కసితో ఆడి ఫైనల్‌కు చేరింది. కానీ తుదిపోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓడి టైటిల్‌ను చేజార్చుకుంది. కాగా, 2022 టీ20 వరల్డ్ కప్‌లోనూ పాకిస్థాన్ జింబాబ్వే చేతిలో పరాజయాన్ని చవిచూసింది. ఆ తర్వాత గొప్పగా పుంజుకుని ఫైనల్‌కు చేరింది. కానీ టైటిల్ పోరులో తడబడి కప్‌ను చేజార్చుకుంది.