T20 World Cup Semi Final Scenario: టీ20 వరల్డ్ కప్‌లో పసికూనలు పరోక్షంగా స్ట్రాంగ్ టీమ్స్‌పై ప్రభావం చూపిస్తున్నాయి. కొన్ని జట్లకు అది వరంగా, మరికొన్ని జట్లకు శాపంగా మారుతోంది. గ్రూప్-బిలో ఉన్న ఒమన్ జట్టు చిత్తుగా ఓటమిపాలవ్వడం స్కాట్లాండ్‌కు ఎఫెక్ట్‌గా మారింది. ఒమన్ ఇంగ్లండ్‌కు భారీగా నెట్‌రన్‌రేటు ఇచ్చింది. దీంతో ఇంగ్లండ్‌తో స్కాట్లాండ్ సమంగా అయిదు పాయింట్లు సాధించినప్పటికీ ఇంటి ముఖం పట్టింది.
ఇప్పుడు సూపర్-8లోనూ అమెరికా సెమీఫైనల్స్ రేసును కంట్రోల్ చేస్తోంది. సూపర్-8లోని గ్రూప్-2లో సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్‌తో పాటు అమెరికా ఉన్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో అమెరికా 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సఫారీ సేనపై గట్టి పోటీ ఇచ్చి ఆఖర్లో తడబడింది. కానీ శనివారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది. 129 పరుగుల లక్ష్యాన్ని కనీసం 11 ఓవర్ల వరకు కూడా కాపాడుకోలేకపోయింది.

వెస్టిండీస్ వికెట్ కోల్పోయి 10.5 ఓవర్లలో ఘన విజయం సాధించింది. విండీస్ ఖాతాలో నెట్ రన్ రేట్ గణనీయంగా పెరిగింది. ఫలితంగా గ్రూప్-2 నుంచి సెమీఫైనల్స్ బెర్తు సమీకరణాలు తారుమారయ్యాయి. అమెరికా ఘోర పరాజయం కారణంగా ప్రస్తుతం గ్రూప్-2 టాప్‌లో ఉన్న దక్షిణాఫ్రికా కూడా డేంజర్ జోన్‌లో పడింది. ఇక ఇంగ్లండ్‌కు డూ ఆర్ డైతో పాటు రికార్డు విజయం సాధించేలా పరిస్థితి ఎదురైంది. అమెరికా ఓటమి తర్వాత దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ సెమీ అవకాశాలు ఎలా మారాయంటే..
దక్షిణాఫ్రికా ఆడిన రెండింట్లో గెలిచి నాలుగు పాయింట్లతో +0.625 నెట్‌రన్‌రేటుతో ఉంది. అయితే వెస్టిండీస్‌కు (2 పాయింట్లు, +1.814) మెరుగైన రన్‌రేటు ఉండటంతో సౌతాఫ్రికాకు సెమీస్ బెర్త్ గ్యారెంటీ లేదు. సెమీఫైనల్స్‌కు వెళ్లాలంటే వెస్టిండీస్‌తో జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్‌లో విజయం సాధించాల్సిందే. ఒకవేళ దక్షిణాఫ్రికా ఓటమిపాలైతే.. అమెరికా చేతిలో ఇంగ్లండ్ (2 పాయింట్లు, +0.412) ఓడాలి లేదా తమ రన్‌రేటు దాటకుండా ఉండాలి.
వెస్టిండీతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనా దక్షిణాఫ్రికా నేరుగా సెమీస్‌కు వెళ్తుంది. ఒకవేళ మ్యాచ్ టై అయ్యి సౌతాఫ్రికా ఓటమిపాలైతే.. అమెరికాపై ఇంగ్లండ్ ఓడాలి లేదా 19 ఓవర్ల తర్వాతే బట్లర్ సేన గెలవాలి. అప్పుడే దక్షిణాఫ్రికా అర్హత సాధిస్తుంది. మరోవైపు ఇంగ్లండ్ సెమీస్ చేరాలంటే.. అమెరికాపై తప్పక ఘన విజయం సాధించాలి. దక్షిణాఫ్రికా చేతిలో వెస్టిండీస్ ఓటమిపాలవ్వాలి. ఒకవేళ వెస్టిండీస్ గెలిస్తే నెట్‌రన్‌రేటు కీలక పాత్ర పోషిస్తుంది.