టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్‌లో భారత్-ఆస్ట్రేలియా తలపడితే ఆసక్తికరంగా ఉంటుందని విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్ అన్నాడు. తమతో తుదిపోరు జరగాలని భారత అభిమానులు సైతం కోరుకుంటారని ఈ ఆసీస్ ఎడమచేతి వాటం బ్యాటర్ తెలిపాడు. గతేడాది జరిగిన వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్, వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ ఓటమికీ ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తుంటుందని హెడ్ పేర్కొన్నాడు.
2023లో ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్, వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. టోర్నీ ఆద్యంతం సత్తాచాటిన రోహిత్ సేన తుదిమెట్టుపై బోల్తా పడి ట్రోఫీలను చేజార్చుకుంది. ఈ రెండు తుదిపోరుల్లోనూ ట్రావిస్ హెడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. సెంచరీలతో కదంతొక్కి టీమిండియా ఓటమికి కారణమయ్యాడు.

గత పొరపాట్లను సరిదిద్దుకొని భారత్ మరో మహా సమరానికి సిద్ధమైంది. టీ20 వరల్డ్ కప్ వేట కోసం బయలుదేరింది. గ్రూప్-ఏలో ఉన్న భారత్ ఇవాళ ఐర్లాండ్‌తో తలపడనుంది. గ్రూప్-బీలో ఆస్ట్రేలియా ఉంది. సూపర్-8 దశకు ఇరు జట్లు అర్హత సాధించడం సులువే. కానీ ఫైనల్స్‌కు చేరుకోవాలంటే టఫ్ ఫైట్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే భారత్-ఆసీస్ మధ్య టైటిల్ పోరు జరిగితే ప్రేక్షకులు థ్రిల్లింగ్ ఫీల్ అవుతారని హెడ్ అన్నాడు.
''టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా తలపడితే ఎంతో బాగుంటుంది. గత రెండు ఐసీసీ ఫైనల్స్‌ను దృష్టిలో పెట్టుకొని, అదే జట్లు మరోసారి టైటిల్ పోరులో పోటీపడాలని ఇండియాలో ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మాపై ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ తప్పక ఎదురుచూస్తుంటుంది. ఫైనల్స్‌కు ఇరు జట్లు వస్తే మ్యాచ్ ఆసక్తికరంగా ఉంటుంది. తుదిపోరులో మేం రావాలని, అలాగే భారత్ కూడా రావాలని కోరుకుందాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం''
''ప్రస్తుతం భారత్ మంచి స్థితిలో ఉంది. టాప్-4లో టీమిండియా ఉండే ఛాన్స్‌లు అధికంగా ఉన్నాయి. అయితే ఎటాకింగ్ గేమ్ ఆడటం ఆ జట్టుకు ఎంతో కీలకం. రోహిశర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రాతో జట్టు బలంగా ఉంది. ఐపీఎల్‌లో బుమ్రా అద్భుతంగా రాణించాడు'' అని ట్రావిస్ హెడ్ అన్నాడు.