టీ20 వరల్డ్ కప్‌లో సూపర్-8 మ్యాచ్‌లకు భారత్ సిద్ధమైంది. లీగ్ దశను వరుస విజయాలతో హోరెత్తించిన టీమిండియా తదుపరి దశలో కఠినమైన ప్రత్యర్థులతో తలపడనుంది. అయితే సూపర్ పోరుల షెడ్యూల్ భారత జట్టుకు విశ్రాంతి లేకుండా చేస్తోంది. చివరి రెండు మ్యాచ్‌లకు కేవలం ఒక్క రోజు మాత్రమే విరామం ఉంది.
ఆ ఒక్క రోజులోనే టీమిండియా తదుపరి మ్యాచ్ కోసం ప్రయాణం చేయాల్సి ఉంది. దాంతో పాటు విశ్రాంతి తీసుకుని స్ట్రాంగ్ టీమ్ అయిన ఆస్ట్రేలియాతో పోరుకు సిద్ధమవ్వాలి. 24 గంటల సమయంలో ఈ పని అంతా భారత ఆటగాళ్లు ఎలా చేస్తారనేదే అసలు ప్రశ్న. దీంతో షెడ్యూల్ చేసిన ఐసీసీని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పరోక్షంగా విమర్శించాడు. బిజీ షెడ్యూల్ అయినప్పటికీ ఎలాంటి సాకులు చెప్పమని, ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికే ప్రయత్నిస్తామని అన్నాడు.

''సూపర్-8లో ప్రత్యేకంగా ఆడాలని జట్టు ఉవ్విళ్లూరుతోంది. టోర్నమెంట్‌లో రెండో దశను ఆరంభించడానికి ఇది మంచి మార్గం. ప్రతిఒక్కరూ ప్రత్యేకంగా అత్యుత్తమ ఆటను కనబర్చాలని శ్రమిస్తున్నారు. ప్రాక్టీస్ సెషన్స్‌లో తమ ఆటను మెరుగుర్చుకోవడం కోసం చెమటోడుస్తున్నారు. ప్రతి సెషన్‌లో ఓ కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఆఖరి లీగ్ (కెనడా) మ్యాచ్ పూర్తయిన నాలుగు రోజుల తర్వాత తొలి సూపర్ పోరు ఆడాల్సి ఉంది''
''ఆ తర్వాత రెండు మ్యాచ్‌లు మూడు నుంచి నాలుగు రోజుల వ్యవధిలోనే ఉన్నాయి. ఇది కాస్త హడావుడిగా ఉంది. కానీ మేం వాటిని అలవాటు చేసుకున్నాం. మేం ఎంతో ట్రావెల్ చేస్తూ ఆడాం. ఇవి కారణాలుగా సాకులు చెప్పాలనుకోవట్లేదు. ఇక్కడ మేం ఎన్నో గేమ్‌లు ఆడాం. జట్టుకు అవసరమయ్యేలా సత్తాచాటడానికి ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. సూపర్-8 స్టేజ్ కోసం ఆటగాళ్లంతా ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు'' అని రోహిత్ శర్మ చెప్పాడు.
టీమిండియా సూపర్-8 మ్యాచ్‌ల షెడ్యూల్
జూన్ 20: భారత్ వర్సెస్ అఫ్గానిస్థాన్ (బార్బడోస్- రాత్రి 8 గంటలకు)
జూన్ 22: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా- రాత్రి 8 గంటలకు)
జూన్ 24: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (లూసియా- రాత్రి 8 గంటలకు)